Ravi vanarsi ……………………
A mother’s success story…………………….
నచ్చిన రంగంలో విజయం సాధించడానికి వయస్సు అనేది అడ్డంకి కాదని నిరూపించిన అద్భుతమైన కథ ఇది. అమృతవల్లి అనే 49 ఏళ్ల మహిళ తన కూతురుతో కలిసి నీట్ పరీక్షలో విజయం సాధించి, డాక్టర్ కావాలనే తన చిరకాల కలని సాకారం చేసుకుంది.ఈ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం.
తమిళనాడు లోని టెంకాసి కి చెందిన అమృతవల్లి జీవితం అనేక మందికి ఒక పాఠం. 49 ఏళ్ల వయసులో ఆమె ఫిజియోథెరపిస్ట్ గా సంతృప్తికరమైన వృత్తి ఉంది. ఎంతో మందికి చికిత్స అందిస్తూ ఆమె ఆ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె హృదయంలో ఒక చిరకాల స్వప్నం సజీవంగానే ఉంది – అదే డాక్టర్ కావాలనే కల.
దశాబ్దాల క్రితం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె వైద్యవిద్యను అభ్యసించలేకపోయారు. అప్పట్లో ఆమె తన కలను పక్కనపెట్టి, ఫిజియోథెరపీ మార్గాన్ని ఎంచుకున్నారు. సమయం గడిచింది, జీవితం ముందుకు సాగింది, కానీ ఆ కల మాత్రం ఎప్పుడూ తనను వదిలి వెళ్లలేదు.
జీవితంలో ఒక మలుపు వచ్చింది. అమృతవల్లి కుమార్తె, సంయుక్త, ఇప్పుడు 18 ఏళ్లు. ఆమె వైద్య కళాశాలలో సీటు సంపాదించడానికి ఉద్దేశించిన నీట్ (NEET) పరీక్షకు సిద్ధమవుతోంది. కూతురు తన కలల దిశగా పయనించడం చూసిన తల్లి హృదయంలో ఏదో కదిలింది. తాను ఒకప్పుడు వదులుకున్న ఆ కలను ఇప్పుడు మళ్లీ ఎందుకు సాకారం కోసం ప్రయత్నించకూడదు అని అనుకుంది.
అమృతవల్లి ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా తన కూతురి పాఠ్యపుస్తకాలను తీసుకున్నారు.దశాబ్దాల తర్వాత విద్యారంగం పూర్తిగా మారిపోయింది. సిలబస్ మారింది, పరీక్షా విధానం మారింది, ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది.సంయుక్త గట్టిగా రివిజన్ చేస్తున్న ప్రతిసారీ, అమృతవల్లి శ్రద్ధగా వినేవారు. ఆమె నేర్చుకున్నారు. ఏకాగ్రతతో మళ్లీ ప్రయత్నించారు.
ఒకవైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు తన వృత్తి, ఇంకోవైపు మారుతున్న సిలబస్‌ను అధ్యయనం చేయడం – ఇదంతా అమృతవల్లికి పెను సవాలుగా మారింది. కానీ, తన కలని సాకారం చేసుకోవాలనే బలమైన కోరిక ఆమెను ముందుకు నడిపింది. కూతురి చదువు కోసం పుస్తకాలు అందుకున్న ఆమె, తన కోసమే వాటిని మనస్ఫూర్తిగా చదివారు.అద్భుతం జరిగింది!
ఈ ఏడాది జులై లో తల్లి అమృతవల్లి, కూతురు సంయుక్త ఇద్దరూ నీట్ పరీక్షలో విజయం సాధించారు. వారి కృషికి, పట్టుదలకు దక్కిన ఫలితం ఇది. అమృతవల్లి కి విరుదునగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. కుమార్తె సంయుక్త జనరల్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నది. (ఈ కథనం రాసేనాటికి సీటు వచ్చే ఉంటుంది)
భౌతికంగా వేరువేరు ప్రాంతాలలో వారిద్దరూ ఒకే మార్గంలో పయనిస్తున్నారు. అమృతవల్లి భర్త లాయర్ .. ఆయన సహకారంతోనే తాను ఈ సవాల్ ను స్వీకరించానని అంటోంది ఆమె. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉంటే, ఎంత కష్టమైనా, ఎంత ఆలస్యమైనా, విజయం మనదే అవుతుంది. అమృతవల్లి, సంయుక్తల ప్రయాణం తమిళనాడులోనే కాకుండా దేశం నలుమూలలా ఉన్న ఎందరో మందికి *స్ఫూర్తి*ని అందిస్తోంది.

