Mother-daughter love story………………..
“ఓ మంచి ప్రేమకథ” ఈ సినిమాను అక్కినేని కుటుంబరావు డైరెక్ట్ చేశారు. రచయిత్రి ఓల్గా కథ,మాటలు, పాటలు అందించారు.ఇది ప్రేమికుల మధ్య నడిచే ప్రేమ కాదు.తల్లి కూతుళ్ల ప్రేమకథ. చాలా కుటుంబాల్లో ప్రస్తుతం ఉన్న సమస్యనే తెరకెక్కించే ప్రయత్నం చేసారు.
ఇందులో కూతురు తన ఉద్యోగంపై దృష్టి పెట్టి, తల్లిని పట్టించుకోకపోవడం, దానివల్ల తల్లి ఒంటరితనం ఫీల్ అవడం .. తదనంతర పరిణామాల చుట్టూ తిరిగే కథ. ఎంచుకున్న కథాంశం మంచిదే కానీ కథ,కథనంపై మరింత కసరత్తు చేసి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేది.
రంగమ్మ(రోహిణి హట్టంగడి) ఒక పల్లెటూళ్ళో ఒంటరిగా ఉంటుంది. ఆమెకు తోడుగా ఆ ఊరికి చెందిన మహి(సౌమ్య), ఆ ఊళ్ళో టీచర్ గా పనిచేసే శంకర్(హిమాంశు పోపూరి)ఉంటారు. రంగమ్మ కూతురు సుజాత(రోహిణి ముల్లేటి), అల్లుడు(సముద్రఖని) బెంగుళూరులో జాబ్స్ చేస్తూ జీవితంలో ఇంకా ఇంకా ఏదో సాధించాలని పరిగెడుతూ ఉంటారు.
ఒక ఇంట్లో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నట్టు ఫీలవుతుంటారు. కూతురు అనన్య(అనన్య నన్నపనేని)ని విదేశాల్లో ఉంచి చదివిస్తుంటారు. కూతురు సమస్యల్లో ఉన్నానని ఫోన్ చేసినా మాట్లాడరు.అదే రీతిలో సుజాత తల్లిని కూడా పట్టించుకోదు. ఒక దశలో సుజాత తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించాలని సొంత వూరు వెళుతుంది. కానీ అక్కడే ఉండి పోతుంది.. తర్వాత ఏమైంది అన్నది అసలు కథ ?
కథనం స్లో గా ఉందనిపిస్తుంది. కథలో చెప్పదలచుకున్న పాయింట్ జనరలైజ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కూతురు తాను సమస్యలో ఉన్నానని చెప్పినా స్పందించని తల్లి తండ్రి ఉంటారా ? ఇద్దరూ స్పందించకపోవడం చిత్రంగా ఉందనిపిస్తుంది. తల్లి ని ఓల్డ్ ఏజ్ హోంలో చేర్పించడానికి వచ్చిన సుజాత… అక్కడే ఉండిపోవాలన్న నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణాన్ని దర్శకుడు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.
“నేను నీకు ఆయా లాగా ఉండాలా? హౌ డేర్ యూ” అని తల్లితో మాట్లాడిన సుజాత వాళ్ళమ్మ ఇచ్చిన ఒక్క ఉపన్యాసంతో మారిపోయి “అమ్మని పెంచుకోవడం”అనే కార్యక్రమం చేపడుతుంది. సినిమా చూస్తే కార్పొరేట్ సెక్టార్ లో పని చేసే భార్యాభర్తలు ఎపుడు గొడవ పడుతుంటారా ? పిల్లల్ని అసలు పట్టించుకోరా ? అనే సందేహాలు కలుగుతాయి.ఎక్కడైనా ఒకటి ఆరా అలాంటి ఉదాహరణలు ఉండొచ్చు. ఇది ఒక కుటుంబానికి చెందిన కథ అని ప్రారంభంలోనే క్లారిటీ ఇస్తే ఇలాంటి సందేహాలు రావు.
ప్రారంభంలో ఫోటోలకు గుడ్ మార్నింగ్ చెప్పే సీన్, రోహిణి హట్టంగడి వణుకుతూ అన్నం తినే సీన్ ,నీళ్లు తాగలేక ఇబ్బంది పడే దృశ్యం,తల్లి ఒడిలో కూతురు పడుకుంటే తల్లి పాట పాడే సీన్, రోహిణి సముద్ర ఖని ఘర్షణ పడే సన్నివేశాలు బాగా వచ్చాయి. హట్టంగడి, రోహిణి కలిసే సీన్.. హట్టంగడి సంతోషంతో మరణించే సన్నివేశాలు సహజంగా వచ్చాయి.
ఎవరి ఆలోచనలైనా మనకు అనుకూలంగా చేసుకోవడమే కదా మన పని. మనిషి, మనిషి స్పర్శ, ముద్దులు కావాల్సింది ఈవయసులోనే.. ఆకలి అంటే అన్నం పెట్టే దిక్కులేదు ఎంత సంపాదిస్తే ఏం లాభం ? ఇద్దరు ఒంటరి వాళ్ళు కలిస్తే ఒంటరి తనం పోతుంది.. ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలని అందరూ అంటారు కానీ స్ట్రాంగ్ అయితే భరించలేరు. ఎప్పుడు ఏది ఇష్టమో దాన్ని ఇష్టపడాలి వంటి ఓల్గా డైలాగులు ఆకట్టుకుంటాయి.
రోహిణి హట్టంగడి చక్కగా నటించారు. బిజీ లైఫ్ లో పరిగెత్తే భార్య భర్త పాత్రల్లో రోహిణి ముల్లేటి, సముద్ర ఖని పర్ఫెక్ట్ గా ఒదిగిపోయారు. సముద్ర ఖని పాత్ర పరిధి చాలా తక్కువ. రోహిణి ముల్లేటి ఈ సినిమాలో తల్లిగా, కూతురుగా బాగా నటించారు. మిగతా వారికి సరైన శిక్షణ ఇవ్వాల్సింది.కొందరైతే డైలాగులు వప్పజెప్పారు.
సినిమా అంతా రెండు, మూడు లొకేషన్స్ లో సింపుల్ గా తీసేసారు.మంచి మెసేజ్ ఇచ్చే పాయింట్ తో కథాంశాన్ని తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదు.దర్శకుడు కుటుంబరావు ఈ విషయంలో గట్టి ప్రయత్నమే చేశారు. ఈ సినిమా పై సోషల్ మీడియా లో విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ చూడదగిన సినిమానే.ఈటీవీ విన్ లో సినిమా స్ట్రీమ్ అవుతోంది.. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

