Mani Bhushan…………….
ఫోటో చూడగానే ఆ జైలర్ పాత్రధారి ఎవరో పాత తరం వారు ఇట్టే గుర్తు పట్టేయగలరు. ఆయన పేరే గోవర్ధన్ అస్రాని. అస్రానీ ఎన్ని పాత్రలు వేసినా షోలేలో ‘ఇంగ్లీషోళ్ల కాలంనాటి జైలర్’ పాత్ర తెచ్చిన గుర్తింపు చెదరనిది. ‘హమ్ ఆంగ్రేజోన్ కే జమానే కే జైలర్ హై’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికి పాపులర్. ఆ సినిమాలో జైలర్ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అన్నట్టు సాగుతుంది.
ఏదైనా ఒక రంగంలో ఎదిగినవాళ్ల గురించి “అతనికేమీ తెలీదండి, అన్నీ మనమే నేర్పించాం” అంటారు రాణింపు, గుర్తింపు లేని సీనియర్స్.బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని దగ్గర మెళకువలు నేర్చుకున్న నటుల్లో జయ బాధురి (బచ్చన్), డానీ, శత్రుఘ్న సిన్హా తదితర టాప్ ఆర్టిస్టులున్నారు.
అస్రానీ సహాధ్యాయుల్లో అదూర్ గోపాలకృష్ణన్, మణి కౌల్, సుభాష్ గాయ్ లాంటి టాప్ డైరెక్టర్స్ ఉన్నారు.‘ఏ రోజునా ఎక్కడ అస్రానీ తన గొప్పలు చెప్పుకొనేవాడు కాదంటారు’ అతనితో పని చేసినవాళ్లు.

పూణే ఇనిస్టిట్యూటులో first batch స్టూడెంట్లలో అస్రానీ ఒకరట! New wave director రిత్విక్ ఘటక్ అప్పట్లో ఫాకల్టీ మెంబర్. ఘటక్ దగ్గర నటనలో, దర్శకత్వంలో అస్రానీ మెళకువలు నేర్చుకుని ఆరితేరారు. బొంబాయిలో స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడుతుండగా పూణే ఇనిస్టిట్యూటులో ఫాకల్టీ అవసరమైంది.
అస్రానీ ఫాకల్టీలో చేరారు. జయ, డానీ, సిన్హా తదితరులను తీర్చిదిద్దారు. ప్రతి శని ఆదివారాల్లో బొంబాయి వెళ్లి అవకాశాలకోసం ప్రయత్నాలు చేసేవారు.అస్రానీ కామెడీ చేసేవారేగానీ, కమెడియన్ కాదు, కారెక్టర్ ఆర్టిస్ట్. హీరో స్నేహితుడు, సలహాదారు పాత్రలు ఎక్కువ వేశారు.
హీరో రాజేశ్ ఖన్నాకి అస్రానీ అంటే చాలా ఇష్టం. తన సినిమాల్లో ఉండాలని పట్టుబట్టేవాడు. ఖన్నా-అస్రానీ కాంబీలో ఓ పాతిక సినిమాలుంటాయి. అస్రానీ ఓ అర డజన్ సినిమాల వరకు డైరెక్ట్ చేశారు. వాటిలో ‘హమ్ నహీ సుధరేంగే’ ఉడాన్, సలాం మెం సాబ్ ,చలా మురారి హీరో బన్నే, అమ్దావద్ నో రిక్షావలో.. వంటి సినిమాలున్నాయి.
అందులో ‘హమ్ నహీ సుధరేంగే’ సినిమా ఇన్స్యూరెన్స్ రంగంపై సెటైరికలుగా తీశారన్నట్లు గుర్తు. కేస్టో ముఖర్జీ పాత్ర చాలా బాగుంటుంది. వీలయితే YouTubeలో చూడండి.
జైపుర్‌లో ఆల్ ఇండియా రేడియోలో పని చేస్తూ డిగ్రీ పూర్తి చేసాడు. నటనపై ఆసక్తితో 1962లో ముంబై వచ్చారు. 1966లో వచ్చిన ‘హమ్ కహా జా రహే హై’తో నటుడిగా అరంగేట్రం చేసాడు. ఆ తరువాత, ఆయన ‘హరే కాంచ్ కీ చూడియా’లో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
షోలే (1975)లోని జైలర్ పాత్రతో తన కెరీర్ కీలక మలుపుతిరిగింది. తన ఐదు దశాబ్ధాలకు పైబడిన కెరీర్ లో ‘హీరో హిందూస్థానీ’, ‘డ్రీమ్ గర్ల్ 2’ సహా 350కిపైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించాడు.కొన్ని సినిమాల్లో పాటలు పాడి కూడా అలరించారు.

