The construction of that temple is a mystery……
ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో కొలువైన కేదార్నాథ్ ఆలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంది. క్రీ.శ. 1300-1900 కాలంలో (లిటిల్ ఐస్ ఏజ్ అని పిలువబడే కాలం) ఈ ఆలయం 400 సంవత్సరాల పాటు దట్టమైన మంచులో కూరుకుపోయిందని చరిత్ర చెబుతోంది.
తర్వాత కాలంలో అన్వేషకుల,శాస్త్రవేత్తల బృందం మంచును తొలగించడంతో ఆలయం బయటపడింది.వందల సంవత్సరాల పాటు మంచులో కూరుకుపోయినా ..ఆలయ నిర్మాణం చెక్కు చెదరక పోవడం గమనించదగిన విశేషం.
డెహ్రాడూన్‌లోని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ నిర్వహించిన పరిశోధన లో ఈ విషయాలు బయటపడ్డాయి. 2013లో ఉత్తరాఖండ్‌లో సంభవించిన వినాశకర వరదల సమయంలో కూడా ఆలయానికి పెద్దగా నష్టం జరగలేదు. అయితే పరిశోధనా బృందం ఆలయ గోడలపై అనేక పసుపు రంగు గీతలను కనుగొన్నది. ఇవి హిమానీనదం నెమ్మదిగా, స్థిరంగా రాళ్లపై కదులుతున్నందున ఏర్పడ్డాయని భావించారు.
ఆలయాన్ని నిర్మించిన వారు భూభాగం, హిమానీనదాలు, మంచు ఏర్పడటాన్ని పరిగణనలోకి తీసుకునే … ప్రకృతి శక్తులను తట్టుకునేంత బలంగా ఆలయాన్ని నిర్మించారని అభిప్రాయ పడ్డారు. ఇక్కడ ఆలయ నిర్మాణం గురించి ఎన్నో సందేహాలు కలుగుతాయి.అసలు ఎవరు దీన్ని నిర్మించారనే సంగతి ఎవరికి తెలీదు.అదొక మిస్టరీ.
చుట్టూ నదులు, కొండలు, మంచు ప్రవహించే ప్రదేశంలో ఎలా ఈ ఆలయాన్ని నిర్మించారనేది ఒక మిస్టరీ. ఈ రోజుకి మనం అక్కడికి వాహనాల్లో వెళ్లలేం. ఆ దారి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా మనవాళ్ళు రోడ్డు వేసేసి కేదారనాద్ ని అరుణాచలం లాగానే , షిర్డీ లాగానో మార్చేసే వాళ్ళు.
మరి ఏ సదుపాయాలు లేని రోజుల్లో ఆ రాళ్లను అక్కడికి ఎలా తరలించారు అనేది పెద్ద ప్రశ్న.రాళ్లు అక్కడి పర్వతాల నుంచే తీసుకొచ్చినవి అని కూడా అంటారు .. అసలు అక్కడ ఆలయాన్ని నిర్మించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ? ఎలా పూర్తి చేశారనేది మిస్టరీ .. మొత్తానికి మనకు తెలియని ఒక శక్తి అక్కడ ఉంది.
ఆలయ నిర్మాణం, అనుసరించిన వాస్తుశిల్పం, నాటి పద్ధతులు అన్నీ ప్రత్యేకమైనవి. ఈ ఆలయం అక్కడ లభించే రాళ్లతోనే నిర్మితమైంది. ఆ ప్రాంతంలో వచ్చే భూకంపాలకు,కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి ఈ రాళ్లు అనువైనట. ఈ బలమైన రాళ్లను ఎలాంటి సిమెంట్ ఉపయోగించకుండా “ఆష్లర్” పద్ధతిలో ఒక రాయిపై మరో రాయిని పేర్చుకుంటూ గోడలు కట్టారు.
ఈ పద్దతిలో రాతిపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయ గోడలు బలం గా ఉంటాయి. అలాగే దృఢమైన పునాదిపై ఆలయం నిర్మితమైంది. అందువలనే 2013లో విపత్కర వరద తాకిడి కి గుడి చెక్కుచెదరలేదు…నాడు సగటుకంటే 375 % ఎక్కువ వర్షపాతం నమోదైంది… చాలా మంది మరణించారు… పలు పరిసర గ్రామాలు దెబ్బతిన్నాయి.
ఇక చాలా హిందూ దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి, ఎందుకంటే ఉదయించే సూర్యుడిని సానుకూలత, కొత్త ప్రారంభాలకు చిహ్నంగా చూస్తారు. కానీ కేదార్‌నాథ్ ఆలయం దక్షిణం ముఖంగా ఉన్న అతి కొద్ది దేవాలయాలలో ఒకటి. ఇదొక అరుదైన విషయం. దీని వెనుక ఉన్న కారణం పురాణాలు, రహస్యాలతో నిండి ఉంది.
ఈ ఆలయం 1,200 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని.. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అని చెబుతారు. గంభీరమైన కేదార్‌నాథ్ శిఖరం (6,940 మీటర్లు) ఆలయం వెనుక ఇతర శిఖరాలతో పాటు నిలబడి ఈ ప్రాంత దృశ్యాలను మరింత అందంగా తీర్చిదిద్దింది. పెద్ద, బరువైన, సమానంగా కత్తిరించిన బూడిద రంగు రాళ్లతో కూడిన ఈ నిర్మాణం ఒక కళాఖండం.
ఆలయ గోపురాన్ని భారీ బూడిద రంగు రాళ్లతో నిర్మించారు, దీనిని నిర్మించడంలో ఎటువంటి మోర్టార్ (సున్నం) ఉపయోగించలేదు. బదులుగా రాతి పలకలను ఇనుప బిగింపులతో ఒకదానితో ఒకటి అనుసంధానించారు. తుఫాను గాలులను సైతం తట్టుకునే విధంగా వాటిని అమర్చారు.
పుష్కరం క్రితం వచ్చిన వరదల్లో ఓ పెద్ద బండరాయి (భీమశిల) ప్రవాహంలో కొట్టుకొచ్చి, సరిగ్గా గుడి వెనుక ఆగిపోయి, వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డుపడింది… తనను తాకి వరద ఇరువైపులా చీలి, గుడికి ఏ నష్టం రాకుండా కాపాడింది. అంతకు ముందు అక్కడ అలాంటి పెద్ద రాయిని చూసిన వారు ఎవరు లేరు .. అదెక్కడి నుంచి వచ్చిందో కూడా మిస్టరీయే.