అక్కడ రైలు ప్రయాణం ఉచితమే !!

Sharing is Caring...

Ramana Kontikarla…………..

కనీస చార్జీలు లేకుండా …. టిక్కెట్ తీసుకోకుండా మనం ప్రయాణం చేయగలమా…?  బస్సెక్కినా, కారెక్కినా, ట్రైన్ ఎక్కినా, రిక్షా ఎక్కినా… ఎంతో కొంత సొమ్ము చెల్లించాల్సిందే.  లేకుంటే… ఒక చోట నుంచి మరోచోటకు వెళ్లలేం. కానీ, ఇప్పటికీ భారతదేశంలో టిక్కెట్ లేకుండానే ప్యాసింజర్లు  ప్రయాణించే ఓ ఉచిత ట్రైన్ నడుస్తోంది. అది మీకు తెలుసా..?

అదే భాక్రానంగల్ రైలు. గత 75 ఏళ్ల నుంచీ ఈ ట్రైన్ లో ప్రయాణీకులు ఎలాంటి టిక్కెట్ రుసుము లేకుండా ఫ్రీగా ప్రయాణిస్తూనే ఉన్నారు. అందుకే, భాక్రానంగల్ ట్రైన్ జర్నీకి ఇండియాలో ఓ ప్రత్యేకత.

ఎందుకలా..?

1948లో ప్రారంభమైన భాక్రానంగల్ ట్రైన్… భారతదేశంలోని అత్యంత ఎత్తైన, ప్రసిద్ధి చెందిన భాక్రానంగల్ డ్యామ్ పైనుంచి ప్రయాణిస్తుంది. వాస్తవానికి ఆ ఆనకట్ట నిర్మాణం సమయంలో… కార్మికులు, నిర్మాణ సామాగ్రిని రవాణా చేయడానికి ఈ రైలును ప్రారంభించారు.

కానీ, కాలక్రమేణా ఆనకట్ట పూర్తయ్యాక కూడా భాక్రానంగల్ రైలు స్థానికులు, పర్యాటకులకు ఓ రవాణా సౌకర్యంగా కొనసాగుతూనే వస్తోంది. అలాగే, అక్కడి పరిశ్రమల అవసరాలకూ ఉపయోగపడుతోంది.మొదట ఆవిరి ఇంజన్ సాయంతో నడిచిన ఈ ట్రైన్… 1953లో యూఎస్ నుంచి దిగుమతి చేసుకున్న డీజిన్ ఇంజిన్స్ తో నడుస్తోంది.

దీన్ని భారతదేశ విభజనకు పూర్వమే ప్రస్తుత పాకిస్థాన్ లోని కరాచీలో మొత్తం చెక్క కోచులతో తయారుచేశారు. కాబట్టి, ఇదొక వింటేజ్ పురా జ్ఞాపకాల చిహ్నంగా కూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పంజాబ్ లోని నంగల్ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని భాక్రా మధ్య 13 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు నడుస్తుంటుంది.

ముఖ్యంగా ఈ రైలు ఎక్కి సట్లేజ్ నది అందాలను చూస్తూ…   ప్రశాంతమైన పచ్చని ప్రకృతి సోయగాలను తిలకిస్తూ … శివాలింక్ కొండల గుండా ప్రయాణిస్తూ రావడం ఓ మధురమైన అనుభూతి. మధ్యలో ఆరు స్టేషన్లలో ఆగుతూ వెళ్లే ఈ భాక్రానంగల్ ట్రైన్..మధ్యలో మూడు పొడవైన సొరంగాలను దాటే క్రమంలో ఒకింత ఉత్కంఠకు గురిచేస్తుంది. అందుకే ఈ మరపురాని మధురానుభవం కోసం కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

 ఉచిత ప్రయాణానికి బీజం ఎలా పడింది..?

ఈ భాక్రానంగల్ రైలును భారతీయ రైల్వేకు సంబంధం లేకుండా… పూర్తిగా భాక్రా బియాస్ మేనేజ్ మెంట్ బోర్డ్ నిర్వహిస్తుంది. 75 ఏళ్ల నుంచీ ఈ ట్రైన్ లో ఎక్కేవారి వద్ద టిక్కెట్ తీసుకోవద్దనీ.. ఉచితంగా ఈ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ఉద్ధేశపూర్వకంగానే ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఈ బీబీఎంబీ బోర్డ్.

ప్రతీ గంటకు 18 నుంచి 20 లీటర్ల డీజిల్ ఇంధనం అవసరమైనప్పటికీ … ఈ రైలును ఉచితంగా నడిపిస్తుండటం విశేషం. భారతదేశ స్వాతంత్య్రం వచ్చాక సాధించిన విజయాలకు ప్రతీకగా ఈ భాక్రానంగల్ రైలును చూస్తామంటోంది బీబీఎంబీ బోర్డ్.

ఈ రైల్లో ప్రతీరోజు ఎనిమిది వందల మందికి పైగా  ప్రయాణిస్తుంటారు. ఉచితమైన ఈ రైలు ప్రయాణంలో… ఇక్కడి పర్యాటకశోభను ఆస్వాదిస్తూ..అనుభవిస్తూ పొందే అనుభూతి మాటల్లో వర్ణించలేనిదంటారు ఇక్కడికి వెళ్లిన పర్యాటకులు.

జపాన్ లో హెరిటేజ్ అండ్ సైట్ సీయింగ్ ట్రైన్స్ లో పండుగలు, ప్రత్యేక వేడుకల సమయంలో ఉచితంగా అనుమతిస్తారు. అలాగే, స్విట్జర్లాంజ్ లోని గ్లేసియర్ ఎక్స్ ప్రెస్ కూడా కొన్ని సీజన్లలో ఉచిత ప్రయాణాన్నందిస్తోంది. కానీ, మన దేశంలోని భాక్రానంగల్ ట్రైన్ మాత్రం గత 75 ఏళ్ల నుంచీ.. ఎప్పుడూ ఉచిత ప్రయాణాన్ని అందిస్తూనే ఉంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!