రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారు? ప్రభుత్వం మొండిగా ఎందుకున్నది?ఒకటి కాదు, రెండు కాదు 17 రోజులుగా ఉద్యమం సాగుతున్నది.మరింత ఉధృతమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది,అని ఆందోళన చేస్తున్న రైతుల వాదన. కాదు రైతుల వెనక స్వార్థ రాజకీయ శక్తులున్నాయి అని ప్రభుత్వ వాదన. రైతుల వెనక రాజకీయ శక్తులు ఉంటే ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు సహజమే కదా.రాజకీయాలు లేనిది ఎందులో? రాజకీయాలకు తప్పుడు అర్ధాలు ఎందుకు ? ఓ చట్టం తప్పు అనిపించినపుడు బాధిత వర్గం వెనక సహజంగానే రాజకీయ పార్టీలు ఉంటాయి కదా.
అది తప్పుడు చట్టం కాదని నిరూపించుకోవాల్సిన విధి అధికారంలో ఉన్నవారిదే కదా.అందులో ఇబ్బందేమిటి? చట్టం రూపుదిద్దేది ప్రజల కోసమే కదా.అలా కాకుండా ఒక ఆశ్రిత వర్గం కోసం ఆ చట్టాలు చేశారని అనుకోవడానికి అవకాశం ఉన్నది కదా.అలాంటి శంక,అనుమానం నివృత్తి చేయాల్సిన బాధ్యత సర్కారుదే కదా.వీటిలో ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? చేసిన వ్యవసాయ చట్టాల్లో ఉన్న మంచి-చెడులను ప్రభుత్వం వివరించేందుకు ఎందుకు పూనుకోవడం లేదు?ప్రభుత్వం మొండిగా వ్యవహరించవలసిన అవసరం ఏమిటి?ప్రభుత్వ ధోరణి అలా ఉండకూడదు కదా?నచ్చజెప్పవలసిన కర్తవ్యం ప్రభుత్వానిదే కదా.
రైతుకు జరిగే మేలు ఏమిటి? ఏ మేరకు లాభం? ఎలా లాభిస్తుంది?నిజంగా ప్రభుత్వం రైతు మేలు కొరినట్లైతే ఆ మూడు చట్టాలోని మంచి చేసే అంశాలను వివరించి నచ్చజెప్పవచ్చును కదా.
ఆ పని ఎందుకు చేయడం లేదు? కొంత మంది మేధావులు చెబుతున్నట్లుగా ఈ చట్టాల్లోని మంచిని రైతులు,వారి ఆందోళనకు మద్దతునిస్తున్న వర్గాలు విశ్వసించడం లేదేందుకు?రైతు కు నచ్చజెప్పే పనికి ప్రభుత్వం సిద్ధమవడం లేదేందుకు?చట్టాల వెనక ఇతర లక్ష్యాఉన్నాయనే నింద ను మోయవలసిన అవసరం ఏమిటి?ఇందులో బేషజాలందుకు? అంతా వివరించి ఆందోళనను విరమిపజేయవచ్చును కదా. కానీ అలా జరగడం లేదు .. అదే ఆందోళనకర అంశం.
కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని రైతు సంఘాలు తాజాగా పిలుపునిచ్చాయి. ఇవాళ ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా రహదారులు దిగ్బంధించ బోతున్నారు. టోల్‌గేట్ల వద్ద రుసుం చెల్లించకుండా నిరసన తెలపబోతున్నారు. ఈనెల 14న ఉత్తర భారతదేశంలోని రైతులంతా ఢిల్లీని ముట్టడించాలని, దక్షిణ భారతదేశంలోని రైతులు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టాల వల్ల రైతులు కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై బతకాల్సిన పరిస్థితులు వస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నది. అదలా ఉంటే రైతుల సహనాన్ని పరీక్షించొద్దని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కేంద్రప్రభుత్వానికి సూచించారు. రైతుల డిమాండ్లపై కేంద్రం సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే, ఉద్యమం దేశ వ్యాప్తంగా విస్తరిస్తుందని హెచ్చరించారు. కాగా, మోదీ సర్కార్ తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, రైతుల కంటే కార్పొరేట్లకే ఇవి ఎక్కువ ప్రయోజనాలు కలిగించేలా రూపొందాయని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త, భారత మాజీ ఆర్థిక సలహాదారుడు కౌశిక్ బసు విమర్శించారు. ఉదృతం అవుతున్న ఈ ఉద్యమం ఏమలుపు తిరుగుతుందో ?
———- Govardhan Gande