రమణ కొంటికర్ల …………………
జీవితమొక నాటకం. నాటకమే జీవితం. ఆ నాటకానికి పెట్టుబడి నమ్మకం. నమ్మకమే జీవితం. నమ్మకంపైనే జీవితం ఆధారపడి ఉంది. నమ్మినోళ్లనే మోసం చేయొచ్చు. గొర్రె కసాయినే నమ్ముతుంది. నమ్మకపోతే పనులు జరుగవు. నమ్మితే మోసపోమనే గ్యారంటీ లేదు. అలా అని నమ్మినప్పుడు కచ్చితంగా మోసపోతామనేది కచ్చితమేం కాదు. కానీ, నమ్మినప్పుడు మోసపోవడమనేది సర్వసాధారణం.
నమ్మకం ఒక మార్కెట్ టూల్. నమ్మకమనే పెట్టుబడి అన్నింటికన్నా పెద్దది. నమ్మించగల్గితే ఓ దర్శకుడు సినిమా కోసం ప్రొడ్యూసర్ ను ఒప్పించొచ్చు. ఒక ఏజెంట్ కొత్త కొత్త వినియోగదారుల్ని పట్టుకుని ఇన్స్యూరెన్స్ పాలసీలు చేయొంచొచ్చు. ప్రభుత్వోపాధ్యాయులు కూడా ప్రైవేట్ స్కూల్ కు వెళ్లే పిల్లల్ని సర్కార్ బడి బాట పట్టించొచ్చు. ఇక పనైపోయిందేనని చేతులెత్తేసిన రోగిని డాక్టర్ బతికించవచ్చు. నమ్మకానికున్న శక్తి అటువంటిది.
కానీ, నాటకమనే జీవితంలో చుట్టూ అన్నీ పులులేనని భయపడటం మన మీద మనకే నమ్మకం లేనట్టు. కానీ, నిచ్చెనమెట్ల వైకుంఠపాళీ జీవితంలో పాములూ ఉంటాయి. మెట్లెక్కి ఎదుగుతున్నప్పుడుండే ఆనందం వేరు. కానీ, పాము మింగి కిందకు జారి పడినప్పుడు ఆ ఆనందమే ఆవిరైపోతుంది. అలా అని నమ్మకం కోల్పోతే ఆటే ఉండదు. గెలవాలన్న నమ్మకమే జీవితమనే ఆటకు ప్రేరణ.
నాల్గు కాలాలపాటు సమాజజీవిగా బతకాలంటే కావల్సింది నమ్మకమే. నిన్ను నిన్నుగా నిలబెట్టుకోవాలంటే కావల్సిందీ నమ్మకమే. నీ అస్తిత్వానికి గుర్తింపు నమ్మకం. నీ ప్రగతికి మొదటిమెట్టు నమ్మకం. నమ్మకాన్ని వమ్ము చేసుకుంటే నీ చుట్టూతా అంతా బానే కనిపిస్తున్నా నిన్ను నమ్మేవారుండరు.
అది నీకు లోలోన అంతర్లీనంగా తెలుస్తున్నా ఆత్మస్తుతి పరనిందలా బతుకుతున్నావంటే నీ మీద నువ్వే నమ్మకాన్ని కోల్పోతున్నట్టు. నీమీద సమాజానికి నమ్మకం లేకపోతోందని నీకర్థమైతున్నట్టు. నువ్వు లోలోన కుములుతున్నదంతా బయటకొస్తున్నట్టు.
నమ్మకం ఓ వ్యక్తి చుట్టూ ఓ ఆరా లాంటింది. ఆ నమ్మకమే నిలబెడుతుంది. గౌరవం పెంచుతుంది. బాధ్యతలనిస్తుంది. ఆ నమ్మకాన్ని కాపాడుకుంటావో, వమ్ము చేసుకుంటావో ఆధారపడేది నీపైనే. నమ్మకమే మనిషికి బాధ్యత నేర్పిస్తుంది. ఆ బాధ్యతే క్రమశిక్షణనిస్తుంది. ఆ బాధ్యతలో కనబర్చే క్రమశిక్షణే నీకు చివరకు గౌరవాన్ని కల్పిస్తుంది. ఆ నమ్మకమే ఓ పరిపూర్ణ వ్యక్తిగా నిన్ను నిలబెడుతుంది. అదే జీవనసత్యం. దాన్ని పట్టించుకోనివాళ్లకదో బ్రహ్మపదార్థం.