మరణం తధ్యమని తెలిసీ …….

Sharing is Caring...

Bhandaru Srinivas Rao………….. 

‘మరణం తధ్యమనీ… ఏ జీవికి తప్పదనీ… తెలిసినా’…దాసరి నారాయణ రావు రాసిన ఈ ప్రేమాభిషేకం సినిమా పాటని తలపించే ఒక సంఘటన జూన్ 26 బుధవారం అమెరికాలో జరిగింది.

‘హై! (ఫ్రెండ్స్) ! నేను! టానర్! టానర్ మార్టిన్ ని. చూస్తున్నారు కదా! నేను చనిపోతున్నాను’ అనే రికార్డెడ్ వీడియోని కొన్ని లక్షల మంది చూసారు. అతడి వీడియోలకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఫాలోయర్లు వున్నారు.

ఇదేమీ ప్రేమలో విఫలమై, జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసి అప్ లోడ్ చేసిన వీడియో కాదు. టానర్ మార్టిన్ ఓ సాధారణ వ్యక్తి. పుట్టుకతో కానీ,హోదారీత్యా కానీ ప్రముఖుడు కాదు. చనిపోయేనాటికి అతడి వయసు కేవలం ముప్పై మాత్రమే. అతడికి భార్య, నెలరోజుల క్రితమే పుట్టిన పాప వున్నారు.

ఇతడి మరణానికి కారణం కేన్సర్. 2020 లో అది బయట పడడమే నాలుగో దశలో బయటపడింది. చికిత్స చేయడం మినహా డాక్టర్లు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఫలితం లేని వైద్యం అని డాక్టర్లకు తెలుసు, అతడికీ తెలుసు. దానితో ఒక నిర్ణయానికి వచ్చాడు.

మరణం తధ్యమని తెలిసిన నాటి నుంచి, చివరాఖరుకు చావు ఘడియ దగ్గరపడి, మృత్యుపాశం మెడకు చుట్టుకునేవరకు అతడు తన జీవితంలో ప్రతి సంఘటననీ రికార్డ్ చేస్తూ వచ్చాడు. వాటినన్నింటినీ సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వచ్చాడు.

ఈ విషయంలో అతడెన్నడూ నిరాశావాదాన్ని ప్రదర్శించలేదు. కిమో థెరపీ వంటి బాధాకర దృశ్యాలే కాదు, టెస్ట్ ట్యూబ్ విధానంలో భార్య ఒక శిశువుకు జన్మ ఇవ్వడం, తాము చేసిన విదేశీ యాత్రలు, భార్యతో కలిసి ఐర్లాండ్ వెళ్లి తమ పెళ్లినాటి ప్రమాణ దృశ్యాలను మళ్ళీ చిత్రీకరించడం మొదలైనవి అతడు తీసిన వీడియోల్లో వున్నాయి.

ఇవన్నీ అతడికి లక్షలాదిమంది అభిమానుల్ని సంపాదించి పెట్టాయి.రోగం చికిత్సకు లొంగడం లేదని, ఏమిచేసినా లాభం లేదని డాక్టర్లు పెదవి విరిచారు. చేతులు ఎత్తేశారు. రోజు గడిస్తే చాలన్నట్టుగా ఏదో ఉపశాంతి వైద్యం చేస్తున్నారు.

బుధవారం నాడు మార్టిన్ తన ఫైనల్ వీడియో పోస్టు చేశాడు. నిజానికి అతడి కోరిక మేరకు అతడి భార్య మిసెస్ షె రైట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దానితో అతడి మరణ వార్త ప్రపంచానికి తెలిసింది. అయిదు నిమిషాల నిడివి కలిగిన ఆ వీడియో పోస్టు చేసిన కొద్ది వ్యవధిలోనే ఎనభయ్ లక్షల మంది చూసారని అంచనా.

‘చనిపోవడానికి ముందు మీ అందరితో ఆ విషయం పంచుకోవడం నాకు మంచి అవకాశం అనుకుంటున్నాను. నా జీవితం పెను సవాళ్లతో గడిచిన మాట నిజమే కానీ మరో నిజం చెబుతున్నాను. జీవితం చాలా అద్భుతమైనది. నేను బాగా ఆస్వాదించాను. ఎందుకంటే ఎవరికైనా ఒకటే జీవితం. అయినా దీని తర్వాత మరోటి ఏదో వుందని నా నమ్మకం. నమ్మకం నిజమైతే దాన్నీ ఆస్వాదించడమే, మరోమాట లేకుండా.

‘మరొక్క మాట. ఇతరుల పట్ల దయగా వుండండి. ప్రేమగా చూడండి. ఒకసారి జీవితం ముగిసిపోయాక చేద్దామని అనుకున్నా చేయలేము. ప్రతి మనిషికి ఒకే ఒక జిందగీ’ ‘మరణం అంటే ఎవరికైనా భయమే. కానీ అది ఒక కొత్త సాహస కృత్యం లాంటిది. అది ఎలా వుంటుందో చూడాలని ఆతృత పడుతున్నాను.

ఆ అనుభవం బాగా ఉంటుందని, వుండాలని ఆశ పడుతున్నాను’ పుట్టిన ప్రతి జీవీ గిట్టక మానదు. హుందాగా మరణించడంలోనే వుంది గొప్పతనం.టానర్ మార్టిన్ చివరి వీడియో లో చెప్పిన మాటలు పూర్తిగా అనుసరించదగినవే.ఇతరుల పట్ల దయగా వుండండి. ప్రేమగా చూడండి… జీవితం చాలా అద్భుతమైనది.. ఆస్వాదించండి. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!