ఆ ఇద్దరికీ ఎందుకు చెడింది ?

Sharing is Caring...

ఏపీ అసెంబ్లీ లో స్పీకర్ తమ్మినేని సీతారాం .. ప్రతిపక్ష నేత చంద్రబాబు ల మధ్య వాగ్యుద్ధాలు చూస్తుంటే  ఆ ఇద్దరు ఉప్పు నిప్పు లా వ్యవహరిస్తున్నారా అనిపిస్తుంది. సీతారాం ను స్పీకర్ అని కూడా చూడకుండా చంద్రబాబు వేలెత్తి చూపుతూ మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో సీతారాం కూడా కొన్ని సందర్భాల్లో ఆయనపై విసుక్కున్న ఉదారణలున్నాయి. పలుమార్లు ఇరువురి మద్య మాటల తూటాలు పేలాయి. ఢీ అంటే ఢీ అన్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే  ఆ ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే అనిపిస్తుంది ఎవరికైనా. ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి చూస్తే ……..  

ఒకప్పుడు తమ్మినేని బాబుకి అనుకూలంగానే ఉన్నారు. బాబు క్యాబినెట్లో సమాచార శాఖా మంత్రిగా కూడా చేశారు. 2009 లో  సీతారాం ప్రజారాజ్యంలో చేరారు. ఆ సందర్భంగా  బాబు ‘మీరు ఎలా గెలుస్తారో ? అసెంబ్లీ కెలా వస్తారో  చూస్తా’ అంటూ తమ్మినేనిని  హెచ్చరించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే సీతారాం బావమరిది  కూన రవి కుమార్ ను టీడీపీ తరపున ఆముదాలవలసలో తమ్మినేని మీద పోటీకి దించారు. ప్రత్యేకంగా ఆ నియాజకవర్గంపై దృష్టిపెట్టారు. నాడు జరిగిన హోరా హోరి పోరులో ఓట్లు చీలిపోయి తమ్మినేని 16,200 తేడాతో ఓడిపోయారు . ఆయనకు 32000 ఓట్లు రాగా,  కూన రవి కి 29400  ఓట్లు వచ్చాయి.  కాంగ్రెస్ నేత సత్యవతి గెలిచారు. 

అప్పట్లోనే ఎర్రం నాయుడికి తమ్మినేని కి కూడా పడేది కాదు. పేరుకి తమ్మినేని జిల్లా అధ్యక్షుడు .. పెత్తనం అంతా ఎర్రం నాయుడుదే. బాబు కూడా ఎక్కువగా ఎర్రం నాయుడితోనే మాట్లాడేవారు.  2004 ఎన్నికల్లో ఎర్రం నాయుడు గెలవగా తమ్మినేని ఓడిపోయారు. ఎర్రం నాయుడు తనకు వ్యతిరేకంగా పని చేసి ఓడించారని తమ్మినేని నమ్మకం. దీంతో తమ్మినేని పార్టీ వదిలి పెట్టారు. ఆ సందర్భంగానే  బాబు హెచ్చరించారని అంటారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయ్యాక   తమ్మినేని తిరిగి టీడీపీలో చేరారు. అయితే ఎక్కువ కాలం ఉండలేదు. అప్పట్లో రాష్ట్ర విభజనకు అనుకూలం అంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని తమ్మినేని సీతారాం తప్పపట్టారు. రాష్ట్ర విభజన విషయంలో బాబు కీలకపాత్ర పోషించడంపై సీతారాం విమర్శించి పార్టీ నుంచి బయటికొచ్చారు.

తర్వాత వైసీపీ లో చేరి 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 19 ఎన్నికల్లో గెలిచి స్పీకర్ అయ్యారు.   తమ్మినేని మొదటినుంచి కొంత దూకుడుగానే ఉండేవారు.  కాంగ్రెస్ నేత బొడ్డేపల్లి రాజగోపాల రావు ని ఓడించి 1983లో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ తమ్మినేని ని ప్రోత్సాహించారు. ఆనాడు బాబు అలా వ్యవహరించడం వల్లనే సీతారాం బాబు విషయంలో కఠినంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీతారాం  స్పీకర్ గా ఎన్నికైనపుడు కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో ఉండి కూడా త‌న సీటు నుండి క‌ద‌ల్లేదు. అచ్చంనాయుడు వ‌చ్చి స్పీక‌ర్‌కు అభినంద‌న‌లు తెలిపారు.మొత్తం మీద నాడు వ్యతిరేకించిన తమ్మినేని ఎటూ కాకుండా పోతారనుకుంటే …. మళ్ళీ  గెలిచి స్పీకర్ గా రావడం, అధ్యక్షా అంటూ చంద్రబాబు ఆయన ముందే నిలబడాల్సిరావడం రాజకీయ వైచిత్రి. ఇపుడు బాబుకి ఇష్టమున్నా లేకపోయినా తమ్మినేని ముందు లేచి నిలబడక తప్పదు. అధ్యక్షా అవకాశం ఇవ్వండి అంటూ అడగక తప్పదు. రాజకీయాల్లో అపుడపుడు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయి. 

————- KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!