Market crash ……………………………
స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. మరో వైపు ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హాంకాంగ్, చైనా మార్కెట్లు దాదాపు 10శాతం పతనమ్యాయి.
ఇన్వెస్టర్ల భయాలు, ఆందోళనలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో పతనం కొనసాగే సూచనలు ఉన్నాయంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల లో ప్రతికూల వాతావరణం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి కారణాలు మార్కెట్ ను డౌన్ ట్రెండ్ లోకి నెట్టి వేసాయి.
ఇదే ట్రెండ్ కొనసాగితే మార్కెట్ బేరిష్ ట్రెండ్ లో పడొచ్చు.ప్రస్తుతం మార్కెట్లను ప్రస్తుతం ఉత్తేజపరిచే అంశాలు ఏమి లేవు. ప్రపంచ దేశాలనుంచి ఇంకేదైనా శుభవార్త వచ్చినా మార్కెట్ రికవరీ బాటలో పడవచ్చు. ప్రస్తుతానికైతే పతనం ప్రమాదం ఇంకా పొంచి వుంది అనే చెప్పుకోవాలి. ఇదే పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగదు.
ఏదో ఒక దశలో మార్కెట్ పుంజుకుంటుంది. కరెక్షన్ లేదా పతనం మార్కెట్ కి కొత్తేమి కాదు. గతంలో ఎన్నోసార్లు మార్కెట్ వేర్వేరు కారణాలతో పతనమైంది. అనంతరం మళ్ళీ పుంజుకొని ఇన్వెస్టర్లకు లాభాలను అందించింది. పెరుగుట విరుగట కొరకే అన్నట్టు విరుగుట పెరుగట కొరకే అని భావించాలి.
షేర్ల ధరలు పడిపోవడం అంటే ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు మంచి అవకాశం లభిస్తుందని చెప్పుకోవాలి. మార్కెట్ పతనంతో షేర్ల ధరలు తగ్గి ఇన్వెస్టర్లకు అందుబాటు లోకి వస్తాయి. కాబట్టి మార్కెట్ పడిపోతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సమయం లో మార్కెట్ కదలికలను పరిశీలిస్తూ మంచి షేర్లను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవాలి.
ఫండమెంటల్స్ బలంగా ఉండి, మంచి వృద్ధిని సాధిస్తున్న షేర్లను ఎంపిక చేసుకొని మార్కెట్ స్థిరపడ్డాక మదుపు చేయాలి. షేర్ల ధరలు తగ్గుతున్నాయి కదా అని ఈ దశలో కొనుగోళ్లకు దిగడం కొంత రిస్క్ కూడిన వ్యవహారం. ఈ దశలో కొనుగోళ్ళకు దిగితే షేర్ల ధరలు మరింత పతనమైతే నష్ట పోయే ప్రమాదం వుందని చిన్నఇన్వెస్టర్లు ముఖ్యం గా గుర్తించాలి.
———KNM