A film about people with extreme tendencies ……………………
‘వివేకానందన్ వైరల్’ మలయాళ సినిమా ఇది. తెలుగులో డబ్ చేశారు. వివేకానందన్ సొంత ఊరికి దూరంగా ఉండే సిటీలో పని చేస్తుంటాడు. వీక్ ఎండ్ లో మాత్రమే ఇంటికి వస్తుంటాడు. ఇంటి దగ్గర భార్య,కూతురు, తల్లి ఉంటారు.తండ్రి విడిగా మరో కొడుకు దగ్గర ఉంటుంటాడు.
వివేకానందన్ శృంగారం లో విపరీత ధోరణి కలిగి ఉంటాడు. భార్య సితార తో మొరటుగా ప్రవర్తిస్తుంటాడు.భార్య కూడా ఇతగాడి వైఖరితో విసిగి పోయి ఉంటుంది. వివేకా సిటీ లో డయానా అనే మరో అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉంటాడు. అక్కడ కూడా విపరీత ధోరణితో వ్యవహరిస్తుంటాడు.
వీరిద్దరూ కాకుండా కొత్త స్నేహాల కోసం ప్రయత్నిస్తుంటాడు. ఆడవాళ్లను ఆట వస్తువుగా భావిస్తుంటాడు.డయానాకు వివేకా ప్రవర్తన నచ్చకపోవడంతో తన ఫ్రెండ్ యూట్యూబర్ ఐషుతో కలిసి అతగాడికి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. వివేకా భార్య పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని ఊహించి ఆమెను కలుస్తారు.
ఆమె కూడా అంగీకరించడంతో ముగ్గురు కల్సి ప్లాన్ చేస్తారు..ఆ ముగ్గురు వివేకాకు ఎలా బుద్ధి చెప్పారు? అనేది అసలు కథ. కామెడీ జానర్ అన్నారు కానీ పెద్దగా హాస్యం ఏమీ లేదు. వివేకా విపరీత పోకడ ప్రపంచానికి తెలియాలి అని చెప్పి అతగాడిని ఇంట్లో బంధించి సితార, డయానా లతో కెమెరా ముందు మాట్లాడిస్తుంది ఐషు.
దాన్ని యూట్యూబ్ లో లైవ్ ఇస్తారు.ఆ లైవ్ ను కోట్ల మంది చూస్తారు. అదొక సంచలనమవుతుంది. ఇదంతా లైవ్ లో గమనించిన పోలీసులు, బంధువులు వివేకా ఇంటికొస్తారు. ఈ సీన్స్ అన్ని కామెడీ గా నడుస్తాయి. ఈ సన్నివేశాల్లో నాటకీయత డోస్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది.
కొంత ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంది. తర్వాత తండ్రి పాత్ర రావడం ఏదో చెప్పడం, ఆయన గర్ల్ ఫ్రెండ్ వచ్చి ‘ఆడవాళ్ళ అనుమతి లేనిదే భర్త అయినా సరే చేయి వేయకూడదు’ అని సందేశం ఇస్తుంది. దర్శకుడు చెప్పదలచుకున్న సందేశం కూడా అదే. అదే పాయింట్ ను సితార, డయానా ల చేత కూడా చెప్పిస్తాడు.
ఒక దశలో ఆఇద్దరు వేరే మార్గంలో వెళితే బాగుండేదని కూడా అనుకుంటారు. ఈ సినిమా కొంతమందికి నచ్చ వచ్చు .. మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా ఒకరి జీవితం లైవ్ కెక్కిందంటే … ఇక అంతే సంగతులు.
ఆప్రభావం కుటుంబంపై కూడా పడుతుంది.ఈ తరహా పరిష్కారాల వలన ఊహించని ఘోరాలు, నేరాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. సినిమా అంతా బాగా తీసిన డైరెక్టర్ కమల్ క్లైమాక్స్ విషయంలో మరింత కసరత్తు చేస్తే బాగుండేది.
వివేకా తల్లి, తండ్రి దూరంగా ఉండటానికి కారణాలేమిటో దర్శకుడు ఎస్టాబ్లిష్ చేయ లేక పోయారు.ఈ సినిమా మలయాళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని సమీక్షలు వచ్చాయి.వివేకా పాత్రలో మలయాళం నటుడు ‘షైన్ టామ్ చాకో’ జీవించాడని చెప్పుకోవాలి. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఇది. సితార గా శ్వాసిక తన నటనతో మెప్పించింది. డయానా గా గ్రేస్ యాంటోని కూడా బాగానే చేసింది.
యూట్యూబర్ ఐషు పాత్రలో మరీనా మైఖేల్ మోడరన్ అమ్మాయిగా పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. సినిమాటోగ్రఫీ,మ్యూజిక్ బాగానే ఉన్నాయి. ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉన్నవాళ్లు చూడవచ్చు.