ముప్పై నిమిషాలు కనిపించి ..మాయమయ్యే దీవి మిస్టరీ ఏమిటి ?

Sharing is Caring...

Ramana Kontikarla ………………………     Mysterious Island

‘బాలమిత్ర’ కథలో చదివా’ పగడపు దీవులు’ గురించి .. నమ్మడానికి ఎంత బావుంది అంటాడు చంద్రబోస్ అనే సినీరచయిత ఓ సినిమా పాటలో. అదో ఊహజనితమైన ఆలోచనకు ఓ అక్షర కల్పన. కానీ, అలాంటిదే ఓ రహస్య దీవి  ..? ఇదేం ఊహ కాదు.ఇప్పటికీ మిస్టీరియస్ గానే మిగిలిన ఓ దీవికి సంబంధించిన నిజం ఇది. ఆ ఇంట్రెస్టింగ్ దీవి గురించి తెలుసుకుందాం.

రహస్యదీవి.. వినడానికి ఓ ‘చందమామ’ కథలానో… బాల్యంలో చదివిన ‘బాలమిత్ర’ లోని పుటలో ఉన్నట్టు అనిపించే ఈ దీవి… అతి సుందరమైన కొంకణ్ తీరప్రాంతంలో దాగి ఉంది. దీన్నే సీగల్ ద్వీపమంటారు.అరేబియా సముద్రం కింద దాగి ఉండే ఈ ప్రత్యేకమైన ద్వీపం..

ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ ను ఇష్టపడే సాహసికులు, సైబీరియా వంటి ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులను ఆకర్షించే ఓ అందమైన భూతల స్వర్గం. సముద్రంలో ఏర్పడే ఆటుపోట్ల కారణంగా ఈ ద్వీపం కేవలం 30 నిమిషాలు మాత్రమే కనిపించి  ఆ తర్వాత మళ్లీ మాయమైపోతుంది. సముద్ర గర్భంలోకి వెళ్లిపోతుంది.

ఈ దీవికి చేరుకోవాలంటే మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా దేవ బాగ్ బీచ్ కు వెళ్ళాలి. దీన్ని మినీ థాయ్ లాండ్ అని కూడా పిల్చుకుంటారు. సీగల్ ద్వీపం.. అరేబియాలో ఓ అరుదైన దృగ్విషయమని చెప్పుకోవాలి.  

కేవలం అర్ధగంట సమయం మాత్రమే కనిపించే సీగల్ ద్వీపపు మార్మికత… అంతుచిక్కని పర్యాటక ప్రాంతంగానే పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆటుపోట్లు తగ్గినప్పుడు ఓ చిన్న ఇసుకతో కూడిన ద్వీపం ప్రత్యక్షమవుతుంది. చిన్న ఇసుక తిన్నెలాగా కనిపించినా.. మంత్రముగ్ధుల్ని చేసే పర్యాటకం ఆ ప్రాంతపు ప్రత్యేకత.

ముఖ్యంగా సీగల్స్ ఎక్కువ కనిపించడంతోనే ఈ దీవికి సీగల్ ఐలాండ్ అనే పేరు స్థిరపడింది. ముఖ్యంగా ఇక్కడి పక్షులను చూడ్డానికే రెండు కళ్లూ చాలవు. సీగల్స్ తో పాటు, సంద్రతీరాల్లో మాత్రమే కనిపించే టెర్న్ పక్షిజాతి, కింగ్ ఫిషర్స్ వంటివి ఇక్కడ పెద్దసంఖ్యలో ఆకట్టుకుంటాయి.  

కేవలం అరగంట సమయం మాత్రమే కనిపించి మళ్లీ మాయమయ్యే ఈ దీవి పరిశుభ్రతకు కేరాఫ్ లా కనిపిస్తుంది. చెత్తా, చెదారం కనిపించని స్వచ్ఛమైన దీవి సీగల్ ద్వీపం. ఇక్కడి సూర్యరశ్మి, చుట్టూ విశాలమైన సంద్రం.. ఆ బయటకొచ్చిన అరగంటలోనే చేపలు పట్టే మత్స్యకారులతో ఓ చూడ ముచ్చటైన రహస్యదీవి సీగల్ ఐలాండ్. 

సీగల్ ఐలాండ్ కు వెళ్లాలంటే రైలుమార్గంలో మాల్వన్ కు చేరుకోవాలి. మాల్వన్ నుంచి పర్యాటకులు దేవ్ బాగ్ బీచ్ కి  పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడి స్థానిక మత్స్యకారులు 500 నుంచి 800  రూపాయల మధ్య రుసుం తీసుకుని ఆ అరగంట కనిపించే ద్వీపానికి బోట్స్ ని నడిపిస్తుంటారు.

ఇక ముంబై వైపు నుంచి వెళ్లేవారికి కేవలం 42 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ సీగల్ ఐలాండ్. న్వావా షెవా అనే ఓడరేవు నుంచి ఈ ఐలాండ్ కు చేరుకోవచ్చు. ఆటుపోట్ల సమయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాబట్టి వాటి సమయాన్ని బట్టే ఈ సీగల్ ఐలాండ్ అనే మిస్టీరియస్ దీవి కనిపించే అవకాశముంటుంది.

ప్రతీరోజూ ఒకే సమయానికి కనిపించని ఈ దీవికి చేరుకోవాలంటే ఆటుపోట్ల వచ్చే సమయం వరకు ఓపికతో వేచి చూడక తప్పదు. అయితే, ఈ ద్వీపానికి చేరుకుని బాహ్యప్రపంచానికి దూరంగా కనిపించే ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించడం ఒక అద్భుత అనుభూతిని ఇస్తుంది.  

ఆటుపోట్ల సమయంలో ఆ ద్వీపం పైకి తేలుతున్నప్పుడు చూసిన అనుభూతి జీవితంలో ఓ మరపురాని అసాధారణ  దృశ్యానుభవం. అందుకే ప్రకృతి పర్యాటకులు అసలు తమ జీవితంలో మిస్ కాకుండా చూడాల్సిన ఒక అందమైన, ఒక రహస్యమైన దీవి ఇది.

పక్షుల కిలకిలారావాలతో కూడిన సహజ సౌందర్య ద్వీపం సీగల్ ఐలాండ్ ను తప్పక చూసే ప్రయత్నం చేయండి. థాయ్ లాండ్  వెళ్లకుండానే.. అంతకుమించిన అనుభూతిని ఇస్తుంది ఈ సీగల్ దీవి. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!