Was his death suspicious?………………
ఎన్నో దెయ్యాలను గౌరవ్ తివారీ వేటాడాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ చివరికి అతనే ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు.. ఆత్మే అతడిని చంపిందని అభిమానులు అంటారు.జూలై 7, 2016 లో ఈ ఘటన జరిగింది.
ఢిల్లీలోని గౌరవ్ తివారీ ఇల్లు.. ఉదయం పది గంటలు దాటింది. గౌరవ్ తివారీ గదిలో నుంచి బయటకు రాలేదు.కాఫీ ఇద్దామని భార్య మెల్లగా తలుపు తోసింది.అది తెరచుకోలేదు.చిన్నగా తలుపు తట్టింది.లోపలి నుంచి రెస్పాన్స్ లేదు.గట్టిగా కొట్టింది. అయినా తెరవలేదు. ఏమండీ అంటూ అరిచింది.
నో రెస్పాన్స్. ఆమె కంగారుపడి అత్తమామల్ని పిలిచింది. వాళ్లు వచ్చి ట్రై చేశారు. అయినా రెస్పాన్స్ లేదు.ఈ క్రమంలో బలవంతంగా తలుపులు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే అటాచ్డ్ బాత్రూమ్‌లో అచేతనంగా నేలమీద పడివున్నాడు గౌరవ్ తివారీ. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఉపయోగం లేకపోయింది. అప్పటికే అతను చనిపోయాడు.
గౌరవ్ మెడ చుట్టూ తాడుతో బిగించినట్టుగా నల్లని గీత కన్పించింది. గౌరవ్ సూసైడ్ చేసుకుని ఉంటాడు అన్నారు పోలీసులు. ఊపిరాడకే చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా తేల్చడంతో అతనిది ఆత్మహత్య అని అందరూ డిసైడ్ అయ్యారు. పోలీసుల విచారణలో గౌరవ్ భార్య ఆర్య చెప్పింది విని అందరూ ఆశ్చర్య పోయారు.
‘తన భర్త గౌరవ్‌ని ఓ ఆత్మ వెంటాడుతోంది’ అని చెప్పిందామె. ‘ఆ సంగతి తనతో తరచూ చెప్పేవాడని .. ఆ ఆత్మ తనను ఎప్పుడో ఒకప్పుడు తన అధీనంలోకి తీసుకుంటుందని గౌరవ్ భయపడే వాడని ఆర్య చెప్పింది.గౌరవ్ పని ఒత్తిడిలో అలా మాట్లాడుతున్నాడు అనుకుని పట్టించుకోలేదు’ అందామె.
గౌరవ్ తండ్రి కూడా అది నిజమే కావచ్చు అన్నట్టు చెప్పారు..ఈ క్రమంలోనే గౌరవ్ అభిమానులు అలాగే జరిగిందేమో అని అనుమానపడ్డారు. గౌరవ్ కి ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు, బాధలు లేవు. అయిదు నెలల క్రితమే పెళ్లయ్యింది. ఎందుకు అలా ప్రాణం తీసుకుంటాడు? ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నాతాడుకి వేళ్లాడుతూ ఉండాలి. కానీ అతడు నేలమీద పడివున్నాడు. గౌరవ్ భార్య చెప్పినట్టు అతగాడిని ఆత్మే చంపిందా? అది సాధ్యమేనా?
ఈ నేపథ్యం లోనే రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దేవుడు, దెయ్యాలు లేవనే నాస్తికులు ఈ విషయం విని నవ్వుకున్నారు.దెయాల్ని నమ్మేవారు భయపడ్డారు. తర్వాత కేసును ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు గౌరవ్ ఆత్మహత్యకు ఇంటి గొడవలే కారణమై ఉండొచ్చుఅన్నారు.
గౌరవ్ ప్రొఫెషన్ కారణంగానే కొద్దిరోజులుగా ఇంట్లో గొడవలు జరిగాయట. దెయ్యాలు, భూతాలు అంటూ తిరగడం, అర్ధ రాత్రిళ్లు ఇంటికి రావడం,వీటికి మించి సంపాదన సరిగ్గా లేకపోవడం వంటి అంశాలపై భార్య, తండ్రి కూడా కొంత కాలంగా అతనిని తప్పు పడుతున్నారట. పనివాళ్లు, కొందరు బంధువుల నుంచి పోలీసులు ఈ సమాచారం సేకరించారు. ఫైనల్ గా గౌరవ్ బాత్ రూమ్లో బట్టలు వేసుకునే రాడ్‌కి ఓ క్లాత్‌తో ఉరి వేసుకున్నాడని పోలీసులు తేల్చి ప్రకటించారు.