Paresh Turlapati…………………..
నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవల సమయంలో మనోజ్ 30 మంది బౌన్సర్లను తన వెంట రక్షణగా తీసుకెళ్తే… ప్రతిగా మంచు విష్ణు 40 మంది బౌన్సర్ల ను తన ఇంటికి కాపలాగా పెట్టుకున్నాడు.
అలాగే ఈ మధ్య సెలబ్రిటీలు తమకు రక్షణగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు అని వార్తల్లో చూస్తున్నాం కదా ..
సినీ హీరో హీరోయిన్ల ఫంక్షన్ల లో ఈ బౌన్సర్లు తరచూ మనకి కనిపిస్తుంటారు.. అభిమానులు తోసుకుని సెలెబ్రిటీల మీద పడిపోకుండా రక్షణ కవచంలా ఈ బౌన్సర్లు ఉంటారు… అంతేనా ..బారుల్లో కష్టమర్లు మందు ఎక్కువై గొడవ చేసేటప్పుడు ఈ బౌన్సర్లు రంగ ప్రవేశం చేసి అవసరమైతే దేహ శుద్ధి చేసి లైన్లో పెడతారు. కొంత మంది పొలిటికల్ లీడర్లకు కూడా బౌన్సర్లు ఉన్నారు.
అసలు ఈ బౌన్సర్లు ఎవరు? ఎక్కడ్నుంచి వస్తున్నారు వీళ్లంతా? ఇంట్రెస్టింగ్ అనిపించి
ప్యారడైజ్ దగ్గర కనపడ్డ ఓ బౌన్సర్ ను ఎంక్వైరీ చేస్తే బోలెడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి.
ఒక్క హైదరాబాదులోనే వేల కొద్ది బౌన్సర్లు ఉన్నారు .. వీళ్ల గిరాకీ కూడా మాములుగా ఉండదు.
ఒక్కోరికి రోజుకి రెండు వేలు మొదలుకుని పది వేల వరకు ఉంది. గన్ లైసెన్స్ ఉన్నవారికి కొంచెమ్ రేటెక్కువ ఉంటుంది.సెలబ్రిటీలు బాడీ గార్డులుగా నియమించుకున్నవాళ్ళు మినహా మిగిలినవాళ్ళకు నెలంతా పని ఉండదు.
మీకు అంతంత రేట్లు ఎందుకు అని బౌన్సర్న్ అడిగితే, “సార్ మీరన్నది నిజమే.. మా రేటు ఎక్కువే..ఇదే మామూలు సెక్యూరిటీ గార్డ్ అయితే రోజుకి ఐదు వందలకు కూడా దొరుకుతాడు.. కానీ మాకు అదే ఐదు వందలు ఒక రొజు తిండికే అవుతాయి..పైగా వేలకు వేలు కట్టి జిమ్ములో చేరి రోజూ వర్కౌట్స్ చెయ్యాల్సిందే.. అంత తిని అంత వర్కౌట్స్ చేస్తేనే ఈ ఫిట్నెస్ ఉంటుంది.
మామూలు సెక్యూరిటీ గార్డు ను మమ్మల్ని పక్క పక్కన పెట్టి చూడండి.. విషయం మీకే అర్థమైపోతుంది.. ఇంకో విషయం.. సెక్యూరిటీ గార్డులకు నెలంతా పని దొరుకుతుంది.. మాకు గిరాకీ ఎప్పుడు ఎలా ఉంటుందో మాకే తెలీదు.. సినిమా వాళ్ళ పెద్ద ఫంక్షన్లు జరిగాయి అనుకోండి.. సిటీలో బౌన్సర్లు సరిపోరు.. అలాంటప్పుడు ఓ రూపాయి ఎక్కువైనా వాళ్ళు మా వెంట పడతారు..ఒక్కోసారి రోజుల తరబడి పని ఉండదు “అని చెప్పుకొచ్చాడు.
ఆ బౌన్సర్ చెప్పింది కూడా నిజమే అనిపించింది.. “గొడవలు జరిగినప్పుడు పోలీసు కేసులు అవ్వవా?” అని ప్రశ్నించినప్పుడు , ” అవుతాయి సార్! కానీ ఆ కేసుల గురించి మమ్మల్ని పెట్టుకున్న సెలెబ్రిటీలే చూసుకుంటారు.. మాకు రూపాయి ఖర్చు కాదు.. మహా అయితే ఓ రెండ్రోజుల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది అంతేగా” అని నవ్వాడు.. బౌన్సర్లలో లేడీ బౌన్సర్లు కూడా ఉన్నారు. అయితే వారికి అంత డిమాండ్ లేదు. అన్నట్టు బౌన్సర్ జీవితంపై బబ్లీ బౌన్సర్ అన్న సినిమా కూడా వచ్చింది.