విల్‌ఫుల్ డిఫాల్టర్ల (ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకుని ఎగవేసిన వారు)పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఈ నాటివి కావు. ఎవరు ఎన్ని విమర్శించినా ప్రభుత్వ తీరులో, అధికార యంత్రాంగం లో మార్పు లేదు. తీసుకున్న అప్పులు తిరిగి తీర్చలేకపోయినందుకు న్యాయమైన కారణాలుంటే పోనీలే అనుకోవచ్చు. కానీ విల్‌ఫుల్ డిఫాల్టర్లపై మాత్రం కఠిన చర్యలు తీసుకొని తీరాలి. అదే సామాన్యుడు రెండు వాయిదాలు కట్టకపోతే నానాయాగీ చేసే అధికారులు పెద్దల విషయంలో నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తారు.
అఫ్ కోర్సు వీరి వెనుక పొలిటికల్ లీడర్స్ ఉంటారు . ఒత్తిడి తెస్తుంటారు.వాస్తవానికి డిఫాల్టర్లను పట్టుకోవడం వల్ల దేశానికి ఏమీ ప్రమాదం జరగబోదు.రుణాలు చెల్లించడంలో విఫలమైన కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్ల వ్యక్తిగత ఆస్తులను తక్షణమే విక్రయించి బకాయిలను రాబట్టాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అమలు లో జాప్యం జరుగుతోంది. కంపెనీల రుణ డిఫాల్ట్ కేసుల్లో అరుదుగా మాత్రమే బ్యాంకులు గ్యారెంటీదార్ల నుంచి అప్పులు వసూలు చేస్తున్నాయి.ఆర్థిక శాఖ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తుంది.లోన్ రికవరీకి గ్యారెంటీదార్ల ఆస్తులను అటాచ్ చేయడం కొన్ని కేసుల్లో మాత్రమే జరుగుతోంది. ఇకపై ఇలాంటి ధోరణికి స్వస్తి చెప్పి రుణ రికవరీకి తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ధిక శాఖ సూచించింది. ఇలాంటి కేసుల్లో బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి , గ్యారెంటీదార్లకు వ్యతిరేకంగా సర్ఫేసి చట్టం, ఇండియా కాంట్రాక్ట్ చట్టాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే అవేవి శీఘ్రగతిన అమలు అవుతున్న జాడ లేదు.
బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని ఆపై ఎగ్గొడుతున్న వారి పరువు తీసేలా చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది.ఇందులో భాగంగా డిఫాల్టర్ల పేర్లు, ఫొటోలను దినపత్రిల్లో ప్రచురించాలని సూచించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు లేఖలు రాసింది. ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టే వారి పేర్లు, ఫొటోలను దినపత్రికల్లో ప్రచురించాలని ఆదేశించింది . గుడ్డిలో మెల్లలా డిఫాల్టర్ల ఆస్తులు జప్తు చేయకపోయినా ఎగవేతదారులు గురించి మీడియాకు సమాచారం అందిస్తున్నారు.
బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు ఉద్దేశపూర్వంగా బాకీలను ఎగ్గొట్టిన వారి జాబితాను ఆర్బీఐ ఆమధ్య వెల్లడించింది. డిఫాల్టర్ల లిస్టును బయట పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నాలుగేళ్ల తరువాత ఆర్బీఐ ఈ సమాచారం బైట పెట్టింది . సమాచార హక్కు చట్టం కింద డిఫాల్టర్ల లిస్టు అడగ్గా ఆర్బీఐ 30 మంది మేజర్ విల్‌ఫుల్ డిఫాల్టర్ల లిస్టును విడుదల చేసింది. గతంలో చాలా మంది ఈ లిస్టును అడిగినా, జాతి ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని వాదిస్తూ ఆర్బీఐ ఆర్టీఐ అప్లికేషన్లను తోసిపుచ్చింది. అయితే బాధిత బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు బాకీలను రాబట్టుకోవడానికి డిఫాల్టర్లపై కోర్టుల్లో కేసులు వేయడంతో, కొంత సమాచారం బయటికి వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆర్బీఐ ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందో అర్థమౌతోంది.
——– KNM
Photo courtesy… the indian lawyer
ఇది కూడా చదవండి>>>>>>>>>> వెయ్యేళ్ళ ఆయన పార్థివ దేహం ఇప్పటికీ పదిలమే !!