Taadi Prakash …………………...
జి.ఎన్. సాయిబాబా అనే ఒక మహోన్నత మానవుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు .పచ్చని తూర్పు గోదావరి పోలాల్లోంచి , పేదరికం నుంచి నడిచి వచ్చిన నిరాడంబరమైన మనిషి . నడవలేని , కాళ్లులేని , వీల్ చైర్ లో తప్ప కదలలేని వాడు . భారత దేశంలోని లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ లో మొదటి వరసలో నిలబడగలిగిన సత్తా వున్నవాడు . కవి . సాహితీవేత్త . షేక్స్పియర్ స్పెషలిస్ట్.
యూరప్ లో అనేక దేశాల్లో ఇంగ్లీషు సాహిత్యం పై లెక్చర్లు ఇచ్చినవాడు. డిల్లీలో వేలమంది యూనివర్శిటీ విద్యార్థుల్ని ఉత్తేజ పరిచినవాడు. పేదవాడి విముక్తి కోసం జీవితాంతం తపించినవాడు. నాగపూర్ లోని దుర్భరమైన అండా సెల్ లో ఈ ప్రభుత్వం సాయిబాబాని చిత్రహింసలు పెట్టింది. నరకం చూపించింది. సాయిబాబా గారిది సహజ మరణం కాదు.
ఇది రాజ్యం చేసిన broad daylight murder. సాయిబాబాని ఆగస్టు 28 న హైదారాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రెండు గంటలు ఇంటర్వ్యూ చేశాను. ఆయన మరణం తట్టుకోలేని విషాదం. కన్నీటితోనే ఐనా ఇంతకాలం సాయిబాబా పక్కనే ధైర్యంగా నిలబడిన వసంత గారిని ఎవరు వోదార్చగలరు ?
Tharjani …………….
నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 90 శాతం అంగవైకల్యంతో సహా అనేక రకాల అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న సాయిబాబాకు జైలు అధికారులు సరైన వైద్యం అందించలేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన మందులను కూడా ఆయనకు చేరనివ్వ లేదు. ఖైదీల ప్రాథమిక హక్కులను కూడా పట్టించుకోలేదు.
చదువుకోవడానికి పుస్తకాలు, రాసుకునే వస్తువులు, అవసరమైన మెడిసిన్ కావాలని సాయిబాబా పలుమార్లు కోరినప్పటికీ జైలు అధికారులు పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు అందజేసిన పుస్తకాలను కూడా సాయిబాబాకు ఇవ్వలేదు. అప్పట్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు కూడా. ఆ విషయాలు బయటికి రాకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు.
2014 నుండి క్రూరమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యుఎపిఎ) కింద జైలు శిక్ష అనుభవించిన సాయిబాబా అనేక అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తగిన వైద్య చికిత్స చేయించక పోవడం వల్ల అతని అవయవాలు పని తీరు కూడా మందగించింది.
సాయిబాబాకు పెరోల్ లేదా వైద్యం కోసం బెయిల్‌ను అడిగితే పదేపదే తిరస్కరించారు.తల్లి చనిపోతే అంత్యక్రియలకు (ఆగస్టు 2020) హాజరు కావడానికి కూడా సాయిబాబాకు పెరోల్ ఇవ్వలేదు. ప్రతి ఖైదీకి న్యాయ సలహాదారుడితో మాట్లాడే హక్కును కూడా అధికారులు కాల రాచారు.
ఆయనకు నెలకు రెండు కంటే ఎక్కువ కాల్స్ చేయడానికి అనుమతి ఇవ్వలేదు. కేసు విషయంపై తన న్యాయవాదులతో చర్చించే అవకాశాలు సరైన రీతిలో కల్పించలేదు. చివరికి ముంబాయి హైకోర్టు జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంతో ఆయన 2024 మార్చి 8న నాగ్‌పూర్ జైలు నుంచి చివరికి విడుదలయ్యారు.