Doesn’t movie glamor influence politics?……………………………..
ఒకనాటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ అవార్డుకు ఎంపిక చేసేందుకు ఏర్పాటైన జ్యూరీ ఆయన పేరును సిఫారసు చేసింది. సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును కూడా అందజేసింది. ఇప్పుడు దాదా సాహెబ్‌తో సత్కరించనుంది.
అక్టోబర్ 8న జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మిథున్ ఈ పురస్కారాన్ని అందుకుంటారు. డిస్కో డాన్సర్ సినిమా తో దేశవ్యాప్తం గా పరిచయమైన మిథున్ సినిమా రంగంలో గణనీయమైన విజయాలే సాధించారు.80 వ దశకంలో డిస్కో డాన్సర్ సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. తహదర్ కథ(92) , స్వామి వివేకానంద (98) వంటి చిత్రాలలో నటించి జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు.
మిథున్ గౌరంగ్ చక్రవర్తి. తూర్పు బెంగాల్ లోని బరిసలల్ లో జన్మించారు. ఇపుడు ఆ ప్రాంతం బంగ్లాదేశ్ లో ఉంది. మిథున్ మొదటి సినిమా మృగయా. ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ దర్శకత్వం వహించారు.1976 లో విడుదలైన ఈ సినిమా మిథున్ కు జాతీయ అవార్డును తెచ్చి పెట్టింది. జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలెట్టిన మిథున్ ఎన్నో కష్టాలు పడి స్టార్డం అందుకున్నారు.
దాదాపు 350 సినిమాల్లో ఆయన నటించారు. ఎన్నో అవార్డులు రివార్డులు సాధించారు. నటి యోగితాబాలి ని పెళ్లి చేసుకున్నారు. అన్నట్టు ఆయన కుమారుడు మిమో చక్రవర్తి కూడా నటుడే. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’లో .. నటుడు సుమన్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘కాబూలీవాలా’లో ఇటీవల మిథున్ కనిపించాడు.
కాగా మిథున్ చక్రవర్తి రాజకీయాలలో కీలక పాత్ర పోషించడానికి ప్రయత్నించారు. కానీ ఆయనకు సినిమా గ్లామర్ వర్కౌట్ కాలేదు. గతంలో కొంత కాలం మిథున్ కమ్యూనిస్టు పార్టీలతో కూడా కలసి పనిచేశారు. తర్వాత కాలంలో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు.
దీదీ మిథున్ చక్రవర్తి ని 2014 లో రాజ్యసభకు పంపారు. ఆ తర్వాత తృణమూల్ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. రెండేళ్లు ఎంపీగా చేసిన మిథున్ 2016 లో ఎంపీ పదవికి రాజీనామా చేసారు.శారదా కుంభకోణం తర్వాత ఆయన పదవికి రాజీనామా చేశారు. శారదా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. ఈ క్రమంలోనే ఈడీ మిథున్ని కూడా ప్రశ్నించింది. అప్పటి నుంచి మిథున్ చక్రవర్తి తృణమూల్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
తర్వాత బీజేపీ లో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మిథున్ చక్రవర్తికి బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. అప్పట్లో మీడియా మిథున్ చక్రవర్తే కాబోయే సీఎం అభ్యర్థి అని ఊదరగొట్టింది.కానీ పార్టీ మాత్రం టిక్కెట్ ఇవ్వలేదు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు అర్హులైన కళాకారులు ఎందరో ఉన్నప్పటికీ మిథున్ కి ఈ అవార్డు దక్కడం విశేషం. బీజేపీ లో ఉండటం వల్లనే అది సాధ్యమైందని విమర్శలు కూడా లేకపోలేదు.