సంతోషం ఎక్కడ దొరుకుతుంది..?

Sharing is Caring...

Siva Rama Krishna ………………………….   What is the address of happiness 

మనిషి తను జీవించినంత కాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. సంతోషం కోసమే భోజనం చేస్తాడు.సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు,సంతోషం కోసమే పెళ్ళి చేసుకుంటాడు, పిల్లలు కావాలను కుంటాడు,చేసే పని, కూసే కూత, రాసే రాత… అంతా సంతోషం కోసమే చేస్తాడు. 

సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటు లేదు. చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు మారిందో  మనిషికి అర్థం కావడంలేదు.. ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా చేతిలో ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలనని అనుకుంటాడు మనిషి.

కానీ డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే.లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగుచేసిన సంపన్నులు ఎందరో  ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు.

అధికారం ఉంటే సంతోషం దొరుకుతుందా ? అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు.

అందంగా ఉంటే సంతోషం లభిస్తుందా ? దానికీ రుజువులు లేవు. ఎందరో అందగాళ్లు, సౌందర్యవంతులు మానసిక క్షోభలతో ఆత్మహత్యలు చేసుకొన్న దాఖలాలు ఉన్నాయి.సకల విద్యలనూ అవపోశన పడితే సంతోషం కలుగుతుందా ? అంటే అదీ సత్యం కాదు. ఎందరో విజ్ఞాన ఖనులైన మహానుభావులు అశాంతితో తనువులు చాలించారు.కనుక సంతోషానికి మూలం సంపదలు, అధికారం, చదువు, అందం కావని అనుభవపూర్వకంగా మనిషికి అర్థమైంది.

సంతోషానికి ధనికులు, పేదలు అనే భేదం లేదు. అందం, చదువు అనే తేడాలు లేవు. వయోభేదం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషికి స్వాధీనమై ఉండేది సంతోషం. పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకోవడంలోనే సంతోషం. ఎదిగే పిల్లలకు ఆటపాటలతో గడపడం సంతోషం. యువకులకు తమ కలలను సాకారం చేసుకోవడమే సంతోషం. వృద్ధులకు తమ సంతానాన్ని చక్కగా చూసుకొంటూ ఉండటమే సంతోషం.

కొందరికి ప్రకృతి ఆరాధన సంతోషం.  కొందరికి తీర్థక్షేత్రాలను సందర్శించడం సంతోషం. కొందరికి సంగీతం వినడం సంతోషం. కొందరికి సృజన చేయడమే పరమానందం. ఇలా సంతోషానికి ఒక నిర్వచనం లేదు. ఒక ఉనికి లేదు.ప్రపంచంలోని అణువణువులోనూ సంతోషం నిండి ఉంది. దాన్ని ఆస్వాదించడమే మనిషి చేయాల్సిన పని.

ఉన్నంతలో జీవితాన్ని గడుపుకుంటూ, తోటివారికి సహాయపడుతూ, దీనుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శించేవారికి ఏ సంపదలతోనూ పని లేదు.  మనిషి తన జీవితంలో అనుక్షణం సంతోషాన్ని ఆహ్వానించాలి. అసంతృప్తిని తరిమివేయాలి. కష్టాలకు, కడగండ్లకు, బాధలకు కుంగిపోరాదు. ఉన్నంతలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ గడపాలి. 

ఆత్మీయులతో మనోభావాలను పంచుకొని సేదదీరాలి. అనవసరమైన భయాలను దరిజేరనీయరాదు. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోరాదు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందించే స్ఫూర్తితో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి. మానసికోన్నతికి దారులను అన్వేషించాలి.. ఆనందం, సంతోషం ఈ చిన్ని జీవితానికి ఆయురారోగ్యాలు.అందరమూ సుఖసంతోషాలతో జీవితాన్ని చక్కగా గడుపుదాం.ఇదే జీవిత పరమార్ధం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!