Bharadwaja Rangavajhala ………………………… …
He was the first politician to use cinema for party campaign…….
కాంచీపురానికి చెందిన అన్నాదురై నేత కుటుంబం నుంచీ వచ్చిన వ్యక్తి. తమిళ నాడులో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెరియార్ ఉద్యమాలకు ప్రభావితుడై నాస్తికుడుగా మారి’ ద్రవిడ కళగం’లో చేరారు అన్నా.పెరియార్ వెంటే జస్టిస్ పార్టీలోనూ, ద్రవిడ కళగంలోనూ పన్జేశారు.
ఆ తర్వాత పెరియార్ తో విబేధించి రాజ్యాధికారం సాధించకుండా చేసేది ఏమీ లేదనే వాదనతో ‘ద్రవిడ మున్నేట్ర కళగం’ ప్రారంభించి అధికారంలోకి తీసుకురాగలిగారు. పెరియార్ నుంచీ విడిపోయిన అన్నాదురై కు విశ్వాసపాత్రలైన శిష్యులుగా ‘కరుణానిధి’, ‘ఎమ్జీఆర్’ వ్యవహరించేవారు.
అన్నాదురై రాజకీయనాయకుడే కాదు … పాత్రికేయుడు, అంతకు మించి అభ్యుదయ రచయిత , నాటక కర్త, ప్రయోక్త. జస్టిస్ పార్టీ పత్రికలో సహ సంపాదకుడుగా పన్జేసిన అన్నాదురై పాత్రికేయ జీవితంలో చాలా కాలమే ఉన్నారు.ద్రవిడ రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి నాటకాన్నిసాధనంగా ఎంచుకొని ఆ దిశగా కృషి చేశారు.
నాటకాలు రాయడం, ఆడించడం, పాటలు రాయడం వాటిని పాడించి ప్రజల్లోకి తన అభిప్రాయాలను సూటిగా తీసుకెళ్లడం లాంటి ఆనాటికి కొత్తగా అనిపించే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవారు.ఈ కార్యక్రమాల నిర్వహణలో కరుణానిధి అన్నాకు చేదోడు వాదోడుగా ఉండేవారు.అప్పుడప్పుడే మద్రాసులో వేళ్లూనుకుంటున్న దక్షణభారత సినీ పరిశ్రమను క్షుణ్ణంగా పరిశీలించారు పెరియార్, అన్నాదురైలు.
తమ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి సినిమా కూడా ఒక అద్భుతమైన మాధ్యమంగా పనిచేస్తుందని గుర్తించారు.అన్నాదురై స్వయంగా కొన్ని సినిమాలకు కథలు, మాటలు రాశారు. సామాజిక అణచివేతల గురించి ఆర్దిక దోపిడీ గురించీ కుల వివక్ష గురించీ సినిమాల ద్వారా ప్రశ్నించడం బావుంటుందని తలచి ఆ దిశగా ప్రయత్నాలు చేశారు.
ఈ తరహా తిరుగుబాటు ధోరణి ఉన్న సినిమాలను ప్రజలూ ఆదరించారు. ఈ సినిమాల్లో నటించడం ద్వారానే ఎమ్జీఆర్ కు ప్రజానాయకుడు ఇమేజ్ వచ్చింది.అన్నా ఆలోచనల మేరకు కరుణానిధి రాసిన పవర్ ఫుల్ స్క్రిప్టులతో తయారయ్యే సినిమాలలో నటించడం ద్వారా ఎమ్జీఆర్ కు పీడిత ప్రజల్లో ప్రత్యేక ఇమేజ్ ఏర్పడింది. తమ కోసం పన్జేసే ఓ నాయకుడుగా అతన్ని జనం చూడ్డం ప్రారంభమైంది.
అలా ఒక వేపు కరుణానిధి, మరో వైపు ఎమ్జీఆర్ అన్నా కుడి ఎడమ భుజాలుగా నిలబడి కాంగ్రెస్ ను ఓడించి డిఎమ్కేను అధికారంలోకి తీసుకురాగలిగారు.1949లో విడుదలైన వేలైకారి, నల్లతంబి సినిమాలతో ప్రారంభించి 54లో వచ్చిన సొర్గవాసిల్ వరకు అన్నాదురై సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసేవారు.
ఆ తర్వాత కేవలం కథలు మాత్రమే రాసేవారు.ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో ద్రావిడ పార్టీకి చెందిన వ్యక్తి… మంచి వక్తగా పేరు గాంచిన అన్నాదురై తమిళ సినిమా రంగాన్ని ద్రావిడ పార్టీ ప్రచారానికి వాడుకున్న తొలి రాజకీయ నాయకుడని చెప్పుకోవచ్చు.