కథనం : సుబ్బుఆర్వీ…………………………………
“తమలోని నైపుణ్యాన్ని తాము గుర్తించడమే తొలి విజయం.” కళకు కాదేదీ అనర్హం. చూసే కన్నులుంటే చెత్తకుప్ప కూడా అద్భుతాలకు నెలవు కాగలదు. ఓ కాగితపు ముక్క ఇంకెన్ని అద్భుతాలు చేయగలదు. ఒక కాగితం పై సిరా తో లిఖిస్తే అది రచన, నాలుగు రంగులు విదిల్చి రెండు గీతలు గీస్తే చిత్రం.
మరి వద్దని నలిపి పడేస్తే, ముక్కలు ముక్కలుగా చింపేస్తే చూసే కనులకు ఓ కళాఖండం. చిత్తు కాగితాల్లో చిత్రాలు సూడరా అంటూ తనలోని సృజనాత్మకతకు కళను జోడించి రంగులు మేళవించి పేపరు ప్రేరణతో కాగితాన్ని తన నేస్తంగా మల్చుకుని తనలోని ఆలోచనలకు పదునుపెట్టిన ఆర్టిస్ట్ మేడా రజని.
వాడిపోని పూలను తాకారా, కాగితపు కుసుమాలు సువాసనలు వెదజల్లడం చూశారా, నిత్యం నవ్వుతో మీకు స్వాగతం పలికే పేపరు తోరణాలు ఎదురయ్యాయా. ఈ అనుభవాలు ఒక్కసారి మన పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్ట్ రజని గురించి తెలుసుకుంటే అనుభూతి చెందుతారు.
మచిలీపట్నం లోని గిలకలదిండి గ్రామంలో జన్మించిన రజని చదివింది పదో తరగతే అయినా చిత్రకళ మీద, బొమ్మల మీద ఇష్టంతో ఆకులతో, పూలతో, కాగితాలతో, రాళ్ళతో పలు రకాల ఆకారాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. గమ్ కూడా వాడటం తెలియని నాడు వార్తా పేపర్లను అన్నం మెతుకులతో అంటిస్తూ తొలి ప్రయోగాలు చేశారు.
ప్రశంసలు పేపర్ తో పిచ్చిపనులంటూ విమర్శలు పొందుతూ ఎందరికో స్ఫూర్తిగా సాగింది వారి ప్రయాణం.రజని గారి బంధువుకి ఇచ్చిన ఫ్రేమ్ ఒకటి వారి ప్రయాణాన్ని మార్చేసింది.
వారి బంధువులకు సహాయం చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలపడంలో చెప్పిన మాట “ఇప్పటిదాకా నేను చూడని కొత్తది ఏదైనా బహుమతిగా ఇవ్వండి”అని. ఏమీ వద్దు అనే తిరస్కరణ ఎంత ముద్దుగా చెప్పారు. ఆ మాటకు అక్కడ రజని కాగితాలతో చేసి ఇచ్చిన క్రాఫ్ట్ ఫ్రేమ్ తీసి వారికి బహుమతిగా అందించారు. అది చూసిన ఆయన చాలా ఆశ్చర్యానికి గురయి వెంటనే దాని సృష్టికర్తని కలవాలని ఆశించారు.
స్వతహాగా స్వయంగా ఎదగాలి, తన భర్తకు చేదోడు వాదోడుగా నిలబడాలనే ఆలోచనలకు బలమైన వేదికగా మచిలీపట్నంలోని పట్టాభి ఇన్స్టిట్యూట్ మారింది. చాలా బాగున్నాయి మీ వర్క్స్ ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అనే ప్రశ్నలకు సమాధానం మౌనం, ఎందుకంటే ఆమెకు ప్రత్యేకంగా ఏ గురువు లేరు, ఎవరూ నేర్పనూ లేదు. ఇలాంటి ఒక కోర్స్ ఉంటుందని కూడా తెలియదు.
అందుకే ప్రకృతిలో వికసించే అందాలే ఆమెకు స్ఫూర్తిదాయకాలు వాటికి ప్రత్యక్ష సాక్ష్యం వారి చేతినుండి జాలువారిన కళాకృతులు.చదువే అన్నిటికీ ప్రామాణికం కాదు, చేతి పనులతో చరిత్రను సృష్టించవచ్చనే విషయానికి నిరూపణ రజనీ ఎదిగిన తీరు. పట్టాభి ఇనిస్టిట్యూట్లో మొదలైన ప్రస్థానం పరుగు లంఖించింది.
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ నేర్పేందుకు ప్రకృతి ఒడిలో పాఠాలు నేర్చిన ఈ గృహిణి కన్నా మిన్న ఎవరు..? ‘శ్రీక్రియేషన్స్’ స్థాపించి విద్యార్థులకు ఆన్లైన్ మరియ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు. ఎదిగే కొద్దీ నైపుణ్యం గల వ్యక్తులను బుట్టలో వేసుకుని వాడుకునే ముసుగు మంచోళ్ళు దగ్గరవుతారు. అలాంటిదే రజనీ జీవితంలో జరిగింది.
రజనీ చేస్తున్న పేపర్ క్విల్లింగ్ ఆర్ట్స్ ని వేరొకరు తాము చేసినదిగా చెప్పుకుంటూ రజనీ కి ఏదో భవిష్యత్తు ఇచ్చినట్లు తెరవెనుక ఆపేశారు. ప్రతిభకు గడ్డిపరక అడ్డమా అన్నట్లు ఆ క్రాఫ్ట్స్ వెనుక ఉన్న రజనీ ప్రతిభకు స్వయంగా అవకాశం వచ్చి ఆ ముసుగు తొలగింది. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ భర్తకు సాయంగా వుంటూ మరోవైపు పేపర్ క్విల్లింగ్ లో దూసుకుపోతూ అనతి కాలంలోనే పేపర్ క్వీన్గా పేరు గణించారు.
నలందా విద్యానికేతన్, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్స్ స్కూల్ లో క్రాఫ్ట్ టీచర్ గా పనిచేసి వేల సంఖ్యలో చిన్నారులకు పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ నేర్పారు. ప్రస్తుతం గత సంవత్సర కాలంగా ప్రముఖ మల్టీ మీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ పబ్లిషర్ ‘ఆస్టాజెన్’ లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్ గా , సపోర్టివ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ నర్సరీ నుండి పదవ తరగతి విద్యార్థులకు వీడియో పాఠాలను ప్రిపేర్ చేస్తూ సంస్థ మన్ననలు పొందుతున్నారు.
పిడిలైట్ సంస్థ హాబీ ఐడియాస్ క్రియేటివ్ టీంలో మెంబెర్గా, నా బార్డు, మెప్మా, హ్యాండీ క్రాఫ్ట్స్, VMC వారి ప్రోత్సాహంతో పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రపంచ అలాగే తెలుగు చిత్రకారుల అసోసియేషన్ వారు నిర్వహించే చిత్రకళా సంతలో పాల్గొనడం, నేషనల్ అకాడమీ ద్వారా RSETI సర్టిఫై అయ్యి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వివిధ నగరాల్లో నిర్వహించే ఎస్సెస్మెంట్స్ కి ఇంచార్జ్ గా వ్యవహరిస్తూ ‘సింధు డిజైన్స్’ పేరుతో కుటీర పరిశ్రమ స్థాపించి తనతో పాటు మరికొంతమంది మహిళలకు నేర్పి ఉపాధి, ఆర్ధిక ఆసరా కల్పిస్తూ మున్ముందుకు సాగుతున్నారు.
పలు గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తూ, కళపట్ల అవగాహన కల్పిస్తూ తన కళను నలుగురికీ పంచుతున్నారు. కాట్రేనికోనకి చెందిన క్రియేటివ్ హార్ట్స్ – ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అకాడమీ వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ పురస్కారం ‘గోల్డెన్ బ్రష్ అవార్డు’ వారిని వెతుక్కుంటూ వచ్చింది.
సాధారణ గృహిణి తన అలవాటుతో , పాలుపోక పొద్దుపోక చేసే చిన్న చిన్న పనులే ఎన్నో కళాత్మకతలకు మూలం. పోపు పెట్టడం నుండి పెరడు వరకు, కుట్లు అల్లికల నుండి మెలికల ముగ్గులు దాకా కాస్త మద్దతు ఇస్తే చాలు మహిళలు మహాద్భుతాలు సృష్టిస్తారు.
ఓర్పు, శ్రద్ద, ఏకాగ్రత, సృజనాత్మకతలో మంచి నాణ్యత వల్ల ఉభయ రాష్ట్రాల్లో పేరు మోసిన వారి ఇళ్లలో, ఈవెంట్లలో ఫోటోఫ్రేములు, జ్ఞాపికలు, ఇరవై పై చిలుకు క్రాఫ్ట్స్ తో తనతో పాటు గృహిణులకు నేర్పుతూ తానే కాదు స్వతహాగా ఆర్ధికంగా నిలబడాలి అనుకునే ఎందరో వనితలకు అండగా సాగుతున్నారు. అలవాటుని ఉపాధిగా మార్చుకుని తనతోపాటు మరెందరికో భరోసా అయిన నేటి మేటి తరుణి మన మేడా రజని.