Aruna Miller…………………………………….
హైదరాబాద్ లో పుట్టిన అరుణా మిల్లర్ అమెరికా లోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళగా అరుణ కొత్త చరిత్ర సృష్టించారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి.
అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం పూర్తవ్వగా.. ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మేరీలాండ్ గవర్నర్ పదవి కోసం డెమోక్రటిక్ నాయకుడు వెస్ మూర్, లెఫ్టినెంట్ గవర్నర్ స్థానానికి అరుణా మిల్లర్ పోటీ చేశారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులపై వీరిద్దరూ ఘన విజయం సాధించారు.
గవర్నర్ తర్వాత అత్యున్నత హోదాలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఒకవేళ గవర్నర్ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేని సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారు.
మేరీలాండ్లో అరుణకు ప్రజాదరణ ఎక్కువ. రిపబ్లికన్ మద్దతుదారులు కూడా ఆమెకు అనుకూలంగా పనిచేశారని అంటారు.వెస్ మూర్, అరుణ విజయం కోసం అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేరీలాండ్ లో విస్తృతంగా ప్రచారం చేశారు.
ఇక అరుణ వక్తిగత వివరాల్లో కొస్తే నవంబర్ 6, 1964 లో హైదరాబాద్‌లో మిల్లర్ జన్మించారు. ఆమె కుటుంబం ఆమెకు ఏడేళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. అరుణ న్యూయార్క్‌లో పెరిగింది. మిస్సౌరీ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో BS డిగ్రీని పొందారు. మిల్లర్ 2000లో US పౌరసత్వం పొందారు.
అరుణా మిల్లర్ కాలిఫోర్నియా, హవాయి, వర్జీనియాలోని స్థానిక ప్రభుత్వశాఖల్లో రవాణా ఇంజనీర్‌గా పనిచేసారు. అరుణ 90వ దశకంలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది.1990లో మేరీల్యాండ్‌కు వెళ్లింది, అక్కడ మోంట్‌గో మేరీ కౌన్సిల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌తో కలిసి పనిచేసింది.
2010 — 2018 మధ్య, మిల్లర్ మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో ఆమె రాష్ట్రంలోని 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు, కానీ డెమోక్రటిక్ ప్రైమరీలో డేవిడ్ ట్రోన్ చేతిలో ఓడిపోయారు.