New Record ………………………………………….
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా 22 సంవత్సరాలు పనిచేసి సోనియా గాంధీ కొత్త రికార్డ్ సృష్టించారు.పార్టీ స్థాపితమైన నాటి నుంచి మరే నేత అంత సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షులుగా చేయలేదు. మధ్యలో కొంత కాలం తప్పించి, సోనియా నే ప్రెసిడెంట్ గా పనిచేశారు.
భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్ర సమరం ముందు ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించారు. 1929 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి నెహ్రు మొదటిసారి అధ్యక్షత వహించారు.
నెహ్రు 1929,1930,1936-37,1951-54 లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసారు.సుమారుగా ఎనిమిదేళ్ల పాటు నెహ్రూ కాంగ్రెస్ పార్టీని నడిపించారు.నెహ్రు తనయురాలు ఇందిరాగాంధీ 1959 లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ కి నాయకత్వం వహించారు.తర్వాత 1978 నుండి 1984 వరకు ఆమె పార్టీని ఏడేళ్లు పాటు నడిపించారు.
1985 లో ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆరు సంవత్సరాల తరువాత 1992 నుంచి 1998 మార్చివరకు పీవీ నరసింహారావు, సీతారామ్ కేసరి కాంగ్రెస్ కు సారధ్యం వహించారు.
సోనియా 1997 వరకు కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యురాలిగా కూడా లేరు. ఆమె పార్టీ ప్రాథమిక సభ్యురాలయిన ఏడాది లోపే అధ్యక్షురాలయ్యారు. మొదట్లో పార్టీ కి సారథ్యం వహించేందుకు ఆమె ఒప్పుకోలేదు.ఆ తరుణంలో పీవీ మరికొందరు నేతలు ఆమెకు నచ్చచెప్పి,మనసు మార్చి ఒప్పించారు.
ఇక అప్పటి నుంచి సోనియానే సారధ్యం వహించారు. నమ్మకమైన వారిని కీలక పదవుల్లో పెట్టుకుని పార్టీని 2017 వరకు నడిపారు. 2017 లో రాహుల్ కి పార్టీ పగ్గాలు అప్పగించారు. 2019 మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
2019 ఆగస్టు నుండి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా నాయకత్వం లోనే 2022 అక్టోబర్ 25 వరకు పార్టీ నడిచింది.మొత్తం మీద చూస్తే నెహ్రు వారసులే కాంగ్రెస్ కి ఎక్కువకాలం నాయకత్వం వహించారు. ఈ 22 సంవత్సరాలలో పార్టీ పరాజయాలు ..విజయాలను చవిచూసింది.
సోనియా గాంధీ 1999లో బళ్లారి, అమేథి నుండి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి, రెండు స్థానాలలో విజయం సాధించారు. బళ్లారిని వదిలి అమేథీకి ప్రాతినిధ్యం వహించారు. బళ్లారిలో బిజెపి సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ను సోనియా ఓడించారు 2004 నుంచి రాయబరేలీ స్థానం నుంచి వరుసగా పోటీ చేసి గెలిచారు.2024 లో వయసు మీద పడిన దృష్ట్యా రాజ్యసభకు వెళ్లారు.
కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే 2022 అక్టోబర్ 26 పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. చాలాకాలం తర్వాత గాంధీ కుటుంబానికి సంబంధం లేని నేత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
——KNMURTHY
post updated ………….9-12-2024