Water vs Earth ……………………………..
సౌర వ్యవస్థ బయటి అంచుల నుండి గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్).. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయని జపాన్ స్పేస్ మిషన్ అంటోంది. ఎన్నో పరిశోధనల తర్వాత ఈ విషయాన్ని తేల్చి చెప్పింది.గ్రహశకలాల ద్వారానే బిలియన్ల సంవత్సరాల కిందట భూమ్మీద నీరు, సముద్రాలు ఏర్పడ్డాయని ఈ మిషన్ చెబుతోంది.
ఈ వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయన్నది జపాన్ పరిశోధకులు అంటున్నారు.ఈ భూమ్మీద జీవనం మూలాలు, విశ్వం నిర్మాణంపై పలు అంశాల అన్వేషణలో భాగంగా.. 2020లో రైయుగు (Ryugu) అనే గ్రహశకలం నుంచి భూమ్మీదకు తీసుకొచ్చిన పదార్థాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు.
2014 డిసెంబర్‌లో హయబుసా-2 పేరిట ఒక అంతరిక్ష నౌకను భూమికి దగ్గరలో ఉన్న రైయుగు గ్రహశకలం పైకి పంపారు. ఈ అంతరిక్ష నౌక 2018 మధ్యలో గ్రహశకలం వద్దకు చేరుకుంది, ఆ తర్వాత అది రెండు రోవర్లను .. ఒక చిన్న ల్యాండర్‌ను ఉపరితలంపైకి దింపింది. అక్కడ నుంచి 5.4 గ్రాముల (0.2 ఔన్సుల) రాళ్ళు, ధూళిని సేకరించింది.
ఆ నమూనాలను పరిశీలించిన తర్వాత భూ జీవనానికి సంబంధించిన కొన్ని బ్లాకులలో అమైనో ఆమ్లాల ఉనికిని గుర్తించామని, అంతరిక్షంలోనే అవి ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధన వివరాలను వెల్లడించింది.అంతేకాదు.. రైయుగు శాంపిల్ లో కనిపించిన ఆర్గానిక్ మెటీరియల్ వల్లే భూమ్మీద నీటి జాడలు ఏర్పడి ఉంటాయన్న వాదనకు బలం చేకూరుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అస్థిర, ఆర్గానిక్ మూలాలు అధికంగా ఉన్న సీ-టైప్ గ్రహశకలాలు.. భూమి.. నీటి ప్రధాన వనరులలో ఒకటిగా ఉండ వచ్చంటూ జపాన్, ఇతర దేశాల సైంటిస్టులు అంటున్నారు. ఈ విశేషాలను జర్నల్ నేచర్ ఆఫ్ ఆస్ట్రానమీ పబ్లిష్ చేసింది.
హయబుసా-2 కి ముందు హయబుసా అనే స్పేస్ క్రాఫ్ట్ ను 2010లో అంతరిక్షంలోకి పంపారు. అది కూడా కొన్ని గ్రహశకలాల కి చెందిన నమూనాలను సేకరించి పంపింది. ఇక ఈ భూమ్మీద 71 శాతం భాగంలో నీరు ఉంది. దీనిలో సింహభాగం.. మహా సముద్రాలు, సముద్రాల రూపంలో ఉంది.
మిగతా 29 శాతం లో ఖండాలు, ద్వీపాలు ఉన్నాయి. భూమిపై ఉన్నమొత్తం నీటిలో 96.5 శాతం సముద్రాలలో ఉప్పునీరుగా ఉంది. మిగిలిన 3.5 శాతం మంచినీటి సరస్సులు,హిమానీనదాలు, మంచు పర్వతాలలో ఘనీభవించిన నీటి రూపంలో ఉంది.