తర్జని కథల పోటీలో ఎంపికైన సస్పెన్స్ స్టోరీ !

Sharing is Caring...

నగరంలో అంతుచిక్కని మర్దర్లు..ఒకే రోజు  కొత్తగా పెళ్ళైన ముగ్గురు వివాహిత మహిళల హత్య ? ఈ హత్యల్లో గుర్తు తెలియని  ముస్లిం మహిళ పాత్ర ఉన్నట్టు పోలీసుల అనుమానం ? మిస్టరీని ఛేదించటానికి స్వయంగా రంగంలోకి దిగిన ఏసీపీ రవివర్మ … టీవీల్లో స్క్రోలింగ్ లు వస్తున్నాయ్
***
హత్యలు జరిగిన ప్రాంత ఇన్స్పెక్టర్లు కేసు వివరాలు ఉన్న ఫైల్ ఏసీపీ టేబుల్ మీద పెట్టారు.. మూడు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏసీపీ పెదవి విప్పాడు. ‘ ఇంతవరకు ఎవర్నైనా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారా ?
సార్ ! పాత నేరస్తులందరినీ గాలించాం సార్ ..కానీ ఇది వాళ్ళ పని కాదు సార్ ..’ ఒక ఇన్స్పెక్టర్ చెప్పబోయాడు

‘నాన్  సెన్స్ ! మూడు హత్యల్లో మెడ కోసి చంపిన ఆనవాళ్లున్నాయి ..గ్రాము బంగారం కూడా చోరీకి గురికాలేదు .. దీన్నిబట్టే అర్ధమౌతుంది కదా ..డబ్బు కోసమో ..బంగారం కోసమో ఈ హత్యలు జరగలేదని ..అలాంటప్పుడు పాత నేరస్తుల ప్రమేయం ఇందులో ఉందని ఎలా అనుకుంటారు ?’ విసుగ్గా అడిగాడు ఏసీపీ..  సమాధానం చెప్పలేక ఇన్స్పెక్టర్ నీళ్లు నమిలాడు

‘ బురఖా ధరించి తన ఆనవాళ్లు దొరక్కుండా  ముస్లిం మహిళ తెలివిగా హత్యలు చేసింది సార్ !  ఇంకో ఇన్స్పెక్టర్ అత్యుత్సాహంగా  చెప్పుకుంటూ పోతున్నాడు. ‘ బురఖా ధరించిన వాళ్లంతా ముస్లిం మహిళలే అని మీకెవరు చెప్పారు ..హంతకురాలు తెలివిగా ఆ వేషాన్ని వాడుకుని ఉండొచ్చుగా ? ఇన్స్పెక్టర్ నోరు మూత పడింది  … ఏసీపీ చెప్పటం మొదలుపెట్టాడు.

‘ఈ మూడు హత్యలు డబ్బు కోసమో బంగారం కోసమో జరిగినవి కాదు.. భర్తలను అనుమానించటానికి తగిన ఆధారాలు లేవు ..ముగ్గురు గౌరవనీయమైన కుటుంబాలకు చెందినవారే ! వీళ్ళను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది.. హత్యలు చేసింది ఖచ్చితంగా కొత్తవారే.. సో ! ఈ హత్యల వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి’ కళ్ళుమూసుకుని ఆలోచిస్తూ ‘ అవునూ ..ఈ మూడు హత్యల్లో అమ్మాయిలు కొత్తగా పెళ్ళైనవాళ్ళే కదా ..ముగ్గురి పెళ్లిళ్లు ఒకే రోజు వేరు వేరు సమయాల్లో ఒకే కళ్యాణమండపంలో జరిగాయి కదా ..యాం  ఐ కరెక్ట్ ..’ అన్నాడు ఎసిపి.. నోట మాట రాక ఇన్స్పెక్టర్ ల గొంతు తడారిపోయింది… వాళ్లకు ఏం చెయ్యాలో చెప్పి సీట్లోనుంచి లేచి బయలుదేరాడు ఎసిపి

***
సరిగ్గా రెండు రోజుల తర్వాత ఎసిపి మీడియా సమావేశం ఏర్పాటు చేసాడు.   సార్ ..సార్ ..ఈ మూడు హత్య కేసుల మిస్టరీ వీడిందా ? నిందితురాలిని అరెస్ట్ చేసారా ?   ఎసిపి ఛాంబర్ లో విలేఖరులు ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపించారు . ఎసిపి  కానిస్టేబుల్స్ కి సైగ చేసాడు.. లోపలినుంచి బురఖా వేసుకున్న నిందితురాలిని తీసుకువచ్చి మీడియా ముందు నిలబెట్టారు

‘మీడియా ఫ్రెండ్స్ ! మీరందరూ అనుకుంటున్నట్లుగా హత్యలు చేసింది నిందితురాలు కాదు ..నిందితుడు ..’! చెప్పాడు ఏసీపీ.   ఏసీపీ  మాటలతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది.. సార్ ! ఈ హత్యలు ముస్లిం మహిళే చేసుంటుందని మీ పోలీస్ వర్గాల ద్వారానే తెలిసింది ..మరిప్పుడేంటి సడెన్ గా ఈ ట్విస్ట్ ..’ కొంచెం ఆ ముసుగు తీసి చూపిస్తారా ?’ అడిగారు మీడియా వాళ్ళు

‘సారీ ! కోర్టులో ప్రవేశపెట్టేదాకా అతడి ముఖం మీకు చూపించటం సాధ్యం కాదు ..కావాలంటే ముఖం తప్పించి మిగిలిన శరీరాన్ని చూడొచ్చు ..’ అని ముఖానికి ముసుగు కప్పి బురఖా తొలగించారు.. అందరూ షాక్ తిన్నట్టు చూసారు.
హత్యలు చేసింది కుర్రాడే . ‘ సార్ !  ఇతడు ఈ హత్యలు ఎందుకు చేసాడు ?

‘ సైకో ..సైకో కాబట్టి ఇతడు ఈ హత్యలు చేసాడు ..’ ! కూల్ గా చెప్పాడు ఎసిపి.. పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డారు అక్కడున్నవాళ్ళందరూ ! ఏసీపీ చెప్పటం మొదలుపెట్టాడు  ‘ వీడి పేరు ముసలయ్య ..పేరే ముసలయ్య ..కానీ వీడు కుర్రాడే ..ఈ మద్యే పెళ్లి కూడా అయ్యింది ..భార్య అంటే చాలా ప్రేమ కూడా ..ఓ రోజు రాత్రి  పని మీద ఊరెళ్లాల్సి వచ్చి భార్యకు చెప్పి బ్యాగ్ తీసుకుని బస్సు స్టాండ్ కు వెళ్ళాడు..

ఈ లోపు పని వాయిదా పడిందన్న సంగతి తెలిసి ఇంటికి తిరుగుప్రయాణం అయ్యాడు.. ఇంటి దగ్గర ఎవరిదో సైకిల్ ఉండటంతో అనుమానం వచ్చి తలుపు బాదాడు..దాంతో భయపడి తలుపు తీసిన అపరిచితుడు ముసలయ్యను తోసేసి పారిపోయాడు. బెడ్ రూమ్ లో దాక్కున్న భార్యను చూసి పట్టరాని కోపంతో గొడ్డలితో నరికి చంపి అక్కడే గొయ్యి తవ్వి పాతి పెట్టేసాడు.

చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకుండా భార్య ఇంట్లోనే ఉన్నట్టు ‘ తలుపులు లోపల గడి వేసుకో   ..బయటికి వెళ్తున్నా ..’ అంటూ అందరికీ వినపడేలా తలుపులు దగ్గరికి వేసి వెళ్ళేవాడు ! కానీ భార్య చేసిన మోసంతో ముసలయ్య సైకో గా మారాడు

కొత్తగా పెళ్ళైన యువతులను చూస్తే పగతో రగిలిపోయేవాడు.. ఆ క్రమంలో సత్య సాయి కల్యాణమండపంలో ఒకేరోజు మూడు పెళ్లిళ్లు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకుని వాళ్ళ ముగ్గుర్నీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు ..వాళ్ళని సీక్రెట్ గా ఫాలో అవుతూ బురఖా వేషం గట్టి అదునుచూసుకుని ముగ్గురి గొంతులు మీద బ్లేడుతో కోసి హత్యలు చేసాడు ..’చెప్పడం ఆపాడు ఏసీపీ.

‘మరి ఇతడి మీద మీకు ఎలా అనుమానం వచ్చింది ?’ అడిగారు విలేకర్లు

‘పంచె కట్టుకుని  వంట వాడిగా చెప్పుకుని సత్యసాయి మండపానికి వెళ్లి అక్కడి రిజిస్టర్ లో ఆ రోజు పెళ్లిళ్లు జరగబోయే మూడు కుటుంబాల అడ్రెసులు తీసుకున్నాడు ..అవన్నీ సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి..సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తే ముసలయ్యను పట్టుకోవటం మాకు తేలిక అయ్యింది ! ముసలయ్యను అరెస్ట్ చేసి మాదైన శైలిలో ప్రశ్నిస్తే నిజం ఒప్పుకున్నాడు ‘!అన్నాడు ఏసీపీ.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!