Whose fault is it………………………….
విధి ఆడే వింత నాటకంలో ఒక్కోసారి అమాయకులు కూడా బలై పోతుంటారు.మనకు ఏమి తెలియక పోయినా జైల్లో కూర్చోవాల్సి వస్తుంది.ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు కెవిన్ స్ట్రిక్లాండ్. 19 ఏళ్ళ వయసులో జైలు కెళ్ళి 62 ఏళ్ళ వయసులో నిర్దోషిగా బయటికొచ్చాడు. ఏ నేరం చేయకుండానే 43 ఏళ్లు జైల్లో గడిపాడు. నేను నిర్దోషిని అని మొత్తుకున్నా అతని గోడు ఎవరు పట్టించుకోలేదు. నాలుగు దశాబ్దాల పాటు జైలు గోడల మధ్యే మగ్గిపోయాడు. యవ్వనమంతా ఊచల మధ్య ఆవిరి అయిపోయింది.
ఈ నెల 23 న నిర్దోషిగా బయటకొచ్చిన కెవిన్ స్ట్రిక్లాండ్ గురించి తెలుసుకున్న “గో ఫండ్ మీ” అనే ఎన్జీవో అతగాడికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఎంతోమంది ఉదారులు అతని ఆర్థిక సాయం చేసి బాసట గా నిలుస్తున్నారు.ఇప్పటికి పదికోట్ల రూపాయలు పైగా విరాళంగా వచ్చాయి. తీర్పు తప్పుగా ఇచ్చినందుకు కెవిన్ కు ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా ఆయనకు అందలేదు.
కెవిన్ స్ట్రిక్లాండ్ ఎలా జైలు కెళ్లాడంటే ….
1978 ఏప్రిల్ 25న అమెరికా లోని కన్సాస్ నగరంలోని ఓ ఇంటిపై గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడి చేశారు. షెర్రీ బ్లాక్( 22), లారీ ఇంగ్రామ్(21), జాన్ వాకర్ (20) అనే ముగ్గురిని కాల్చి చంపేశారు. ఈ ఘటన నుంచి తప్పించుకున్న సింథియా డగ్లస్ అనే మహిళ కాల్పులు జరిపిన నలుగురితో పాటు కెవిన్ స్ట్రిక్‌లాండ్ ఉన్నాడని అనుకుని అతని పేరు కూడా పోలీసులకు చెప్పింది.పోలీసులు కెవిన్ ను అరెస్ట్ చేశారు.
కోర్టు విచారణలో కూడా సింధియా డగ్లస్ ఘటనలో కెవిన్ పాత్ర ఉందో లేదో ఖరారు చేసుకోకుండా అతనిపై కూడా ఆరోపణ చేసింది. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని పరిగణన లోకి తీసుకుని కోర్టు 50 ఏళ్ళ శిక్ష విధించింది. తర్వాత కాలంలో తాను పొరపాటు పడినట్టు సింధియా డగ్లస్ తెలుసుకుంది. కనీసం అప్పుడైనా నిజం చెప్పలేదు. నిజం చెబితే కోర్టు తనకు శిక్ష విధిస్తుందేమో అన్నభయంతో మౌనంగా ఉండిపోయింది. ఆమె చేసిన పొరపాటు కెవిన్ పాలిట శాపంగా మారింది. జైల్లో మగ్గిపోయాడు. పోలీసులు కూడా సరైన రీతిలో విచారణ చేయకపోవడంతో కెవిన్ ఇరుక్కుపోయాడు
నలభై రెండేళ్లు గడిచాక మళ్లీ మొన్నటి ఆగస్టులో కెవిన్ శిక్షను సవాల్ చేస్తూ స్థానిక ప్రాసిక్యూటర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న డగ్లస్ అప్పటికీ మరణించడంతో ..ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులను కోర్టు విచారించింది. అయితే కెవిన్ ను దోషి అని చెప్పమని పోలీసులే తనను ఒత్తడి చేశారని డగ్లస్ ఓ సందర్భంలో తమతో చెప్పినట్లు వారు కోర్టుకు తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులు కూడా కెవిన్ తో తమకు సంబంధం లేదని చెప్పారట. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కెవిన్ ను నిర్దోషిగా ప్రకటించింది.