Chernobyl…………………………….
సరిగ్గా 35 ఏళ్ల … మూడురోజుల క్రితం 1986 ఏప్రిల్ 26న సెకన్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం జరిగింది. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ఏప్రిల్ 25 అర్ధరాత్రి దాటాక 1:23 గంటలకు విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.
ఫలితంగా 134 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 28 మంది కొన్ని నెలల్లోనే చనిపోయారు. ఆ తర్వాత మరో 19 మంది మరణించారు. ఇదంతా రేడియోధార్మికత ప్రభావంతో జరిగింది.అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగో నంబరు రియాక్టర్‌లో కొన్ని వ్యవస్థలకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు.
రియాక్టర్ పనితీరును ముందుగా ఎవరూ గమనించ లేదు. ఆ పని చేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదు. అది ఇంజనీర్ల తప్పే అని చెప్పుకోవాలి. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఇంజనీర్లు అజాగ్రత్తగా ఉండటం తో పెను ప్రమాదం చోటు చేసుకుంది.ఇంజనీర్లు విద్యుత్ సరఫరాను నిలిపేయడంతో రియాక్టర్‌కు కూలింగ్ వాటర్‌ను పంపే టర్బైన్ల స్పీడ్ తగ్గింది.
దీంతో కూలింగ్ వాటర్ సరఫరా మందగించింది.అదే సమయంలో రియాక్టర్లో ఆవిరి కారణంగా పీడనం పెరిగింది. ఇది గమనించి ఆపరేటర్లు ఏం జరుగుతోందో గుర్తించి, రియాకర్ట్ ఆపేద్దామని ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.ఆవిరి కారణంగా జరిగిన పేలుడుతో రియాక్టర్ మూత తొలగి పోయింది.
రియాక్టర్‌లోని ‘కోర్’ బయటి వాతావరణంపై ప్రభావం చూపడం మొదలైంది. విద్యుత్ కేంద్రంలోని ఇద్దరు అక్కడే చనిపోయారు. గాలి కారణంగా మంటలు చేలరేగాయి. అవి పది రోజులపాటు కొనసాగాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ సిబ్బంది రంగంలోకి దిగింది.
చెర్నోబిల్ నుంచి వెలువడిన రేడియో ధార్మికతతో కూడిన పొగ, వ్యర్థాలు గాల్లో కలిసి ఐరోపా మొత్తం కొన్ని వేల కిలోమీటర్ల మేరకు వ్యాపించాయి. అప్పట్లో చెర్నోబిల్ పూర్వపు సోవియట్ యూనియన్‌లో భాగం గా ఉండేది. ఇది ప్రస్తుత ఉక్రెయిన్‌లోని ఉత్తర ప్రాంతంలో ఉంది.
ప్రమాదం తర్వాత అణు విద్యుత్ కేంద్రానికి సమీప ప్రాంతాల నుంచి సుమారు లక్షా 16 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.అణు విద్యుత్ కేంద్రానికి 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతం గా ప్రకటించారు. ఆ తర్వాత మరో రెండు లక్షలమందిని సురక్షిత ప్రదేశాలకు చేరవేశారు.
మొత్తం మీద లక్షల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ జోన్‌లో నివసించడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఇప్పటికి సుమారు 130 మంది ఈ జోన్ లోనే ఉంటున్నారు.
ఆ విషయాలు అలా ఉంచితే ఇటీవల ఉక్రెయిన్లో భీకర దాడులకు తెగబడిన రష్యా సేనలు చెర్నోబిల్ ప్లాంట్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.అప్పటినుంచి సైనిక బలగాల కదలికలతో అక్కడ భారీ స్థాయిలో రేడియేషన్ విడుదల అవుతున్నట్లు చెబుతున్నారు.
తాజాగా అది అసాధారణ స్థాయికి చేరుకొని అత్యంత ప్రమాదకరంగా మారిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) కూడా హెచ్చరించింది. దీంతో మరో ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు. డెడ్ జోన్ లోపలికి రష్యా బలగాలు ట్యాంక్ తో వెళ్లడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తినట్లు అనుమానిస్తున్నారు.
భారీ స్థాయిలో సైనిక కదలికల వల్ల అణువ్యర్థాల నుంచి వచ్చే రేడియేషన్ క్రమంగా పెరుగుతోందని అంటున్నారు. మొన్నటివరకు పరిమిత స్థాయిలోనే ఉన్నప్పటికీ ఇటీవల అవి ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.