ట్రైన్ జర్నీకి 10 లక్షల బీమా కవరేజ్.. కొందరికే ఎందుకని ?

Sharing is Caring...

భారతీయ రైల్వేశాఖ రైలు ప్రయాణికులకు బీమా సదుపాయం కల్పిస్తోంది. అయితే IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకునే భారతీయ పౌరులకు మాత్రమే ఈ బీమా కవరేజ్ వర్తిస్తుంది. 

IRCTC  రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తోంది.రైలు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి మరే పని చేయలేని పరిస్థితి ఎదురైతే బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు అందిస్తారు. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా సొమ్ము పొందవచ్చు.

క్షతగాత్రులకు వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. రూపాయి కన్నా తక్కువ రుసుంతో ఇండియన్ రైల్వేస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈ సదుపాయాలు కల్పిస్తున్నది. చాలామంది తెలీక ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం లేదు.

ఆన్ లైన్ లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారికి ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని భారతీయ రైల్వేశాఖ అందిస్తోంది. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు  నష్టపోతున్నారు. ప్రమాదానికి గురైనప్పటికీ ఎలాంటి పరిహారం పొందలేకపోతున్నారు.

ఆన్ లైన్ లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వెబ్ సైట్ లో ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసుకోడానికి ఒక ‘ చిన్న బాక్స్’ వస్తుంది. అందులో టిక్కు పెడితే.. బీమా కోసం రూపాయి కన్నా తక్కువ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన వెంటనే మీ ఫోనుకు, ఈ-మెయిల్ కి ఒక లింక్ వస్తుంది. అది బీమా కంపెనీకి సంబంధించిన లింక్. ఆ లింకు తెరిచి, నామినీ వివరాలను  పొందుపరచాలి. నామినీ వివరాలు అందించకపోతే, బీమా పొందలేము. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు IRCTC ప్రయాణ బీమా వర్తించదు.

దురదృష్టవశాత్తు బీమా తీసుకున్న ప్రయాణికులు రైలు ప్రమాదంలో మరణిస్తే, వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువెళ్లేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.10,000 మొత్తాన్ని  బీమా సంస్థ అందిస్తుంది. బీమా కవరేజ్ సొమ్ము  పొందాలంటే నామినీగా ఉన్న వ్యక్తి తగిన పత్రాలు తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి.

అధికారులు అన్ని పత్రాలను సరిచూసుకున్నాక నాలుగు నెలల్లోపు బాధితులకు బీమా సొమ్ము పంపుతారు. తక్కువ సొమ్ముతో బీమా పొందే ఈ అవకాశాన్ని ప్రయాణీకులు వదులుకోకుండా ఉపయోగించుకోవాలి. ఈ సదుపాయాన్ని అందరికి వర్తింపజేస్తే బాగుంటుంది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!