బ్రిటీష్ సైన్యాన్నిగజగజ వణికించిన తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు.1836-1860 మధ్య కాలంలో నాటి జనగాం (అసిఫాబాద్)ను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడు.1857 లో సిపాయి తిరుగుబాటు జరిగినప్పుడు గోదావరికి ఉత్తరాన ఉన్న గిరిజన ప్రాంత ప్రజలు రాంజీ గోండు నాయకత్వంలో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర పాలకులైన నిజాం. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
బ్రిటీష్ సైన్యంపై వీరోచితంగా పోరాడిన ఝాన్సీలక్ష్మీబాయ్ మరణించిన తర్వాత నానాసాహెబ్, తాంతియాతోపే, రావుసాహెబ్ తదితరులు తమ బలగాలతో విడిపోయారు. తాంతియా అనుచరులైన రోహిల్లా సిపాయిలు పెద్దసంఖ్యలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్,బీదర్, పర్బణి..ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించారు. వీరు అజంతా, బస్మత్,లాథూర్,మఖ్తల్, నిర్మల్ ను కేంద్రాలుగా ఎంచుకుని బ్రిటిష్ సైన్యం పై పోరాటం సాగించారు.
వీరి నేతగా వ్యవహరించిన మరో యోధుడు రంగారావు నిజాం ప్రభుత్వాన్ని పడగొట్టి బ్రిటిష్ వాళ్లను తరిమివేయాలని పోరాటానికి దిగారు.పోరాట వీరులకు శిక్షణ ఇస్తూ .. మరోవైపు ప్రజల్ని పోరాటం వైపు ఉత్తేజితం చేసే క్రమంలో బ్రిటిష్ సైన్యానికి రంగారావు పట్టుబడ్డారు. ఆయన యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ అండమాన్ జైలులోమరణించారు. తదనంతర కాలంలో రాంజీ నేతృత్వంలో తిరుగుబాటు తీవ్రమైంది.
రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనులను కలుపుకుని రాంజీ తన పోరాటాన్ని తీవ్రం చేశారు. ఈ తిరుగుబాటు తుది కీలక ఘట్టం 1860 మర్చి ఏప్రిల్ మాసాల్లో జరిగింది. బానిస బతుకు వెళ్లదీస్తున్న గిరిజనులు ఎదురు తిరగడాన్ని తెల్లదొరలు సహించ లేకపోయారు. చిత్తమొచ్చిన రీతిలో దౌర్జన్య కాండకు పూనుకున్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించారు.
రాంజీ నాయకత్వంలో వెయ్యిమంది రోహిల్లాలు నిర్మల్ సమీపంలోని కొండలలో దాక్కుని బ్రిటిష్ పాలకులను ముప్పుతిప్పలు పెట్టారు. గెరిల్లా పోరాటాలతో సైన్యానికి వణుకు పుట్టించారు. దీంతో నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు ఆధునిక ఆయుధాలతో దాడులు చేశారు. ఈ దాడుల దెబ్బకు గిరిజనులు నిలవలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆదివాసులను పట్టుకుని నిర్ధాక్షిణంగా బ్రిటిష్ సైన్యం కాల్చి చంపారు. చివరి వరకు పోరాడిన రాంజీ మరో వెయ్యి మందిని పట్టుకుని 1860 ఏప్రిల్ 9న నిర్మల్ నడిబొడ్డున ఉన్న మర్రి చెట్టు ఊడలకు తగిలించి ఉరితీశారు.
అదే వెయ్యి ఉరుల మర్రి చెట్టుగా చరిత్ర కెక్కింది. తెల్ల దొరల దురాగతాలకు సాక్షీ భూతంగా నిలిచింది. తర్వాత కాలంలో ఈ మర్రి చెట్టును నరికి వేశారు. గిరిజన సంఘాల నేతలు 2007 నవంబర్ 14న వెయ్యి ఉరుల మర్రి సమీపంలో ఓ స్థూపాన్ని నిర్మించారు.అదలా ఉంటే రాంజీ గోండు నాయకత్వంలో సాగిన పోరాటానికి చరిత్రలో తగిన గుర్తింపు లభించలేదు. పాలకులు కూడా నిర్లక్ష్యం చేశారు. స్వాతంత్య్రం కోసం గిరిజనులు మొదట పోరాడారని చెప్పడం అతిశయోక్తి కాదు. గిరిజన స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించి తెలంగాణ ఒక ముఖ్యమైన భూభాగం గా నిలవడం గర్వించదగిన విషయం .
————-KNM