పంతాలు … పట్టింపులు !

Sharing is Caring...

చిన్న కారణం,
పెనుకోపం,
అంతులేని మనస్థాపం,
వెరసి …. పంతాలు పట్టింపులు …
చివరకి ఆత్మహత్యలు.
ఇది ఆధునిక జీవన శైలిలో కనిపిస్తున్న విపరీత ధోరణి.
తల్లి తండ్రులు మందలించినా,పరీక్షలో ఫెయిల్ అయినా,ప్రియురాలు తిరస్కరించినా,అడిగిన వస్తువులు పెద్దలు కొనిపించకపోయినా.,ఉద్యోగం దొరకక పోయినా,జీవితంపై విరక్తి కలిగినా,గురువులు దండించినా,భర్త/భార్య తో విభేదాలు వచ్చినా,భర్త /భార్య తీరు నచ్చకపోయినా,చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కారణాలు ఏవైనా ఆత్మహత్య ఒక్కటే పరిష్కారంగా భావిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో మరో విపరీత ధోరణి కూడా ప్రబలుతోంది. భార్యాభర్తల నడుమ ఏర్పడిన విభేదాలు పిల్లలను కూడా బలి తీసుకుంటున్నాయి. పిల్లలను చంపేసి తర్వాత పెద్దలు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యల్లో ఎక్కువ భాగం క్షణికావేశంలో జరుగుతున్నవే. ఆత్మహత్యల నేపథ్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తాయి. పుట్టింటికి వెళ్ళిన భార్య సకాలంలో తిరిగిరాలేదని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి మధ్య భేదాభి ప్రాయాలు వున్నాయా అంటే అది లేదు.  మరో సంఘటనలో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. కారణమేమిటంటే భర్త సకాలంలో ఇంటికి రావటం లేదని ఈ రెండు సంఘటనలలోనూ సమస్య చాలా చిన్నది. అయినా రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి.
ఈ విధంగా దేశంలో ఆత్మహత్యలు జరుగుతున్న తీరు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది.
ఇక అతివల ఆత్మహత్యలు ఈ మధ్య  కాలంలో అతివల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి . వీటికి కారణాలు  ప్రేమ విఫలం లేదా ప్రేమలో మోసం కాకుంటే అత్తింటి ఆరళ్ళు ప్రధానమైనవిగా  చెప్పుకోవచ్చు. తమతోబాటు తమ సంతానాన్ని కూడా చంపుకుంటున్న వైనం చూస్తుంటే కనబడని కారణాలు ఎన్నో ఉన్నాయని అనిపిస్తుంది. ఆత్మహత్యే ఒక ఉన్మాద భావన అయితే కన్నబిడ్డలను తల్లి చేజేతులా చంపుకోవడం మరింత ఘోరం. అయితే ఆ తల్లి ఇలాంటి ఘటనకు పాల్పడేముందు ఎంతగా తల్లడిల్లిందో, ఎంతగా రోదించిందో, మరెంత మానసిక వ్యధ అనుభవించిందో ఊహిస్తే భయానకంగా ఉంటుంది.
అతివల ఆత్మహత్య వెనుక భర్తల తప్పులు / బలహీనతలు కారణాలుగా నిలుస్తాయి. అత్తా ఆడపడుచుల ఆరళ్లు తెలిసినా సర్ది చెప్పలేని   భర్తలు కొంతవరకు కారణమవుతుంటారు. తన భార్య క్షణక్షణం చిత్తక్షోభ అనుభవిస్తున్నా మౌన  ముద్ర వహించే భర్తలు ఈ ఆత్మహత్యలకు పరోక్ష కారకులవుతున్నారు.కొందరు మగ వాళ్ళు పర స్త్రీలతో అక్రమ సంబందాలు  కలిగి వుండడం, లేదా మరో స్త్రీ తోరహస్యజీవనం చేయడం వంటి అంశాలు కూడా మహిళలను ఆత్మహత్యలకు పురిగోల్పుతున్నాయి.

భార్యను అనుమానించి శీలాన్ని శంకిస్తూ మానసికంగా,శారీరికంగా  చిత్రహింసకు గురిచేసినపుడు,పుట్టింటి వారు అండగా నిలవనపుడు గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలాగే స్వల్ప కారణాలు కూడా ఉన్నాయి. ఆమధ్య భర్త పండగకు చీర కొనలేదని ఒక మహిళ ప్రాణం తీసుకుంది.  ఆలుమగల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, పరస్పరం ఇష్టంలేని పెళ్లికి బలికావడం, ఇద్దరూ తరచూ కలహించు కోవడంతో కొందరు రోషంతో  తీవ్రమైన భావోద్వేగానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఈ పరిస్థితిని అధిగమించాలంటే  కౌన్సిలింగ్ సెంటర్లు ఎర్పాటు కావాలి. మహిళల్లో మనోధైర్యం పెంపొందించాలి. విద్యాబోధన కాలంలోనే మానసిక శాస్త్ర బోధన విధిగా జరగాలి. సైకాలజీని  ఒక పాఠ్యాంశంగా భోదించాలి. ఇలాంటి ఆత్మహత్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించకుండా ఆత్మహత్యల నివారణకు పూనుకోవాలి.

—— KNM 

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. DRKREDDY September 21, 2020
error: Content is protected !!