Ratan Tata is an inspiration to many………………….
ఎంతటి గొప్పవారికైనా తీరని కోరికలుంటాయి. కొందరు వాటిని వదిలేస్తుంటారు. మరి కొందరువాటిని తీర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. టాటా గ్రూప్ ఛైర్మన్ 86 ఏళ్ళ రతన్ టాటాకు తీరని కోరిక ఒకటుంది. అది చాలా చిన్నదే. వినడానికి మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ అది నిజమే.
పియానో అంటే రతన్ టాటా కు చాలా ఇష్టమట. కానీ దాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకోలేక పోయారట. ఈ విషయాన్నీ రతన్ టాటాయే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోయర్స్ తో పంచుకున్నారు. తాను చిన్నతనంలోనే పియానో వాయించడం నేర్చుకున్నానని, వ్యాపారంలోకి ప్రవేశించాక బిజీ వలన ఆ ప్రాక్టీస్ కొనసాగించలేక పోయానని అంటున్నారు టాటా.
పదవీ విరమణ చేసిన తర్వాత దాన్ని మళ్లీ హాబీగా తీసుకున్నానని, కానీ నేర్చుకోవడం పట్ల శ్రద్ధ చూపలేక పోతున్నాని టాటా చెప్పుకొచ్చారు. పియానో నేర్పించే ఒక మంచి టీచర్ దొరికారు. కానీ రెండు చేతులు ఉపయోగించాల్సి ఉండటంతో నేర్చుకోలేక పోతున్నాని రతన్ టాటా అంటున్నారు. భవిష్యతులో ఖచ్చితంగా నేర్చుకుంటానని ఆయన చెబుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో రతన్ టాటా ఈ విషయం వెల్లడించగానే లక్షల్లో నెటిజన్లు స్పందించారు.
టాటా పోస్ట్ పెట్టిన 24 గంటల లోపు 9 లక్షల మంది వినియోగదారులు దాన్నిఇష్టపడ్డారు. ఆ పోస్టుపై 9 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. టాటా తన ప్రతిభను పెంపొందించుకోవడం చూసి ఆయన అభిమానులు సంతోషించారు. “మీరు ఒక స్ఫూర్తి, సార్.” అని ఒక ఫాలోయర్ కామెంట్ చేశారు. టాటా తన జీవితమంతా నేర్చుకోవాలనే కోరికపై ఆయన “ఎల్లప్పుడూ నేర్చుకునేవారే ” అని ఒకరు స్పందించారు.
ఇంకొకరు “మీరు చేయలేనిది ఏదైనా ఉందా సార్?” అని ప్రశంసించారు. “మీకు అసాధ్యం ఏమీ లేదు సార్.” … “సర్, మీరు రెండు చేతులతో పియానో వాయించే వీడియో కోసం ఎదురుచూస్తాను.” అంటూ అభిమానులు కామెంట్లు వర్షం కురిపించారు.
దిగ్గజ పారిశ్రామికవేత్త గా బిజినెస్ వర్గాలకే కాదు … అంతర్జాలంలో చాలామంది యువకులకూ రతన్ టాటా ఒక ప్రేరణ. సోషల్ మీడియాలో ఎపుడూ చురుగ్గా ఉండే రతన్ టాటా స్ఫూర్తిదాయక అంశాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ సారి మాత్రం తన మనసులో మాటను షేర్ చేశారు.
post updated on 10-10-2024