పెళ్లి పేరిట మోసపోయా !

Sharing is Caring...

“నా పేరు నగీనా.. మానాన్న చిన్నపుడే చని పోయాడు. అమ్మ పత్తి మిల్లులో పని చేసేది. నాకు పదమూడేళ్లు .. నా కంటే పెద్దోడు అన్నయ్య. సైకిల్ షాపులో పని చేసేవాడు. నేను బడికి వెళ్ళే దాన్ని. అనుకోకుండా అమ్మ జబ్బున పడింది. అప్పటినుంచి కష్టాలు మొదలైనాయి.

వంటా వార్పూ నేర్చుకున్నాను. దాంతో  మా మామయ్య పట్నం  తీసుకెళ్ళి ఒకరింట్లో పనికి కుదిర్చాడు. అక్కడ ఇచ్చే జీతం మామయ్య ద్వారా  అమ్మకు పంపే దాన్ని. పనికి చేరిన  ఇంట్లో కొంత కాలం బాగానే ఉంది. తర్వాతే ఇబ్బందులు మొదలైనాయి.

ఆ ఇంటి అమ్మగారి కోసం ఎవరో ఒకతను అయ్యగారు లేని సమయంలో వచ్చేవాడు. వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండగా నా కంట పడ్డారు. అప్పుడేమి అనలేదు కానీ మరుసటి రోజు అమ్మగారు విషయం ఎవరికైనా తెలిస్తే చంపేస్తానని హెచ్చరించారు.నేను కొంచెం భయపడ్డాను.

ఒకసారి అమ్మగారు ఊరు వెళ్లారు. అయ్యగారు తాగి బలవంతం చేసాడు. వద్దని వేడుకున్నా. దారుణంగా రేప్చేసాడు.ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు . డబ్బులు చేతిలో పెట్టాడు. భయంతో ఏమి మాట్లాడ లేకపోయాను . ఆరోజునుంచి రోజు నరకమే. అమ్మగారు ఊళ్ళో ఉన్నా ఆమె నిద్ర పోయాక గదిలోకి దూరేవాడు.

ఇదిలా జరుగుతుండగానే  ఒక ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడ్డాను. కూరలు తేవడానికి మార్కెట్ కెళ్ళే దారిలో అతగాడు పరిచయమైనాడు. రోజు ఇంటిముందు నిలబడి సైగలు చేసేవాడు. అతగాడి పేరు శీను. ఇష్టమైతే పెళ్లి చేసుకుంటా అనేవాడు. నేను ఏది చెప్పకుండా వూరించేదాన్ని.అయ్యగారి ఆగడాలు ఎక్కువయ్యాక  శీను తో పెళ్లి విషయం కదిలించా … అతగాడు  ఎగిరి గంతేశాడు. 

నీదే ఆలస్యం ., ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం అన్నాడు. మొత్తం మీద ఈ నరకం నుంచి బయట పడే అవకాశం దొరికింది. సరే అన్నాను. అనుకున్నట్టుగానే  శీను నేను కలసి పారిపోయాం. విజయవాడలో హోటల్ లో దిగాం. అక్కడే శీను నామెళ్లో తాళి కట్టాడు. రెండు రోజులు అక్కడ గడిపి  .. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళాం.

అమ్మ గారింట్లో దొంగిలించి తెచ్చిన పదివేలు అయిపోయాయి. ఇక బంగారు నగలు మాత్రమే ఉన్నాయి.ఎక్కడైనా ఇల్లు చూడమని చెప్పా శీనుతో .. నగలు అమ్మి సొమ్ము తీసుకురా అని ఉన్నవన్ని అతగాడి కిచ్చా. అదే నేను చేసిన తప్పు అని ఆ తర్వాత తెలుసుకున్నా.. శీను మళ్ళీ రాలేదు.

ఎటు పోయాడో అర్ధం కాలేదు. ఒకరోజు గడిచింది. హోటల్ వాళ్ళు అడ్వాన్సు అయిపొయింది , ఖాళీ చేయమన్నారు.. ఆక్కడొక రూం బాయ్ పరిచయమైనాడు. ఇక శీను రాడు . నాతో రా అన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను.. మర్యాదగానే చూసాడు.ఏమైనా చేస్తాడేమో అనుకున్నా ., అలాంటిదేమీ లేదు..

ఎక్కడైనా పని ఇప్పించమని అడిగా .. రెండు రోజులు గడిచాకా ఒక  ఇంటికి తీసుకెళ్ళి  అక్కడ ఓనరమ్మ కి  పరిచయం చేసాడు.చూడ్డానికి ఆమె మంచి మనిషిలా కనిపించింది… తర్వాత తెల్సింది అక్కడ ఏమి జరుగుతుందో ? అక్కడ అమ్మాయిలతో బిజినెస్ జరుగుతోంది.

24 గంటలు క్లైంట్స్ వచ్చి వెళుతుంటారు. నాలాగా మరో ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు..  రూం బాయ్ నన్ను ఇరవై వేలకు అమ్మేసాడట.రెండో రోజే ఓనరమ్మ చెప్పింది. ఏమి చేయాలో కూడా చెప్పింది. కాదు కూడదు అన్నాను.  చెంపలు పగల గొట్టి చీకటి గదిలో పెట్టింది. ఆ మరుసటి రోజు ఇద్దరు గూండాలు గదిలో కొచ్చి దారుణంగా హింసించారు.

ఆ హింస భరించలేక లొంగి పోయాను.  అక్కడ ఆరునెలలు ఉన్నాను. ఓనరమ్మమరొకరికి అమ్మేసింది.అక్కడ మరో సంవత్సరం ఉన్నాను. ఈ లోగా ఒక రోజు రాత్రి ఒక క్లైంట్ దగ్గరికి పంపారు. అక్కడనుంచి వచ్చేటపుడు నాతో పాటు ఉన్న గార్డ్ కళ్ళు కప్పి ..  రైలెక్కి తప్పించుకున్నాను. కానీ రైల్వే పోలీసులకు దొరికి పోయాను.. ప్రస్తుతం గుంటూరు హోం లో ఉంటున్నా.. ఇంటికి వెళ్ళాలి అని వుంది ఏముఖం పెట్టుకుని వెళ్ళాలి.”

నగీన లాగా మోసపోయే అమ్మాయిలు ఎందరో ఉన్నారు. ఇంటికి వెళ్ళాలని ఉన్నా అక్కడ తల్లి తండ్రులు ఆదరిస్తారో లేదో అన్నభయం తో మళ్ళీ ఎవరి చేతిలోనో  చిక్కి మరో వ్యభిచార గృహానికి చేరుతుంటారు.  “ఇలాంటి వారందరికీ  తొలుత తాత్కాలిక సహాయం అందించి పునరావాసం కల్పించాలని జీవోలు జారీ అయినా అవి సరిగ్గా అమలు కావడం లేదు” అని హెల్ప్ కార్యదర్శి రామ్మోహన్ చెప్పారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!