The Immortal Singer……………….
మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటలకు గాత్రం అందించిన అమర గాయకుడు ఘంటసాల చివరి రోజుల్లో పాడిన భగవద్గీత రికార్డు బయటకొచ్చి 50 ఏళ్ళు దాటింది. సరిగ్గా ఈ రోజుకి యాభై ఏళ్ళ 5 నెలల 9 రోజులు అవుతుంది.
భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాల 108 శ్లోకాలు పాడారు.వీటిని హెచ్‌ఎమ్‌వి సంస్థ 108 శ్లోకాలు తాత్పర్యసహితంగా, కొద్దిపాటి వాద్యాలతో, స్టీరియోలో రికార్డు చేసింది. 1974లో నాటి ప్రముఖ హీరో ఎన్టీఆర్ ఈ ఆడియో రికార్డు ను విడుదల చేశారు.ఘంటసాల మరణించిన రెండు నెలల తర్వాత ఈ రికార్డు విడుదలైంది. నాటి కార్యక్రమంలో ఘంటసాల గొప్పదనం గురించి ఎన్టీఆర్ తో పాటు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా మాట్లాడారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు మనని వదలి వెళ్ళి దాదాపు అయిదు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ ఆయన పాటలను ఎవరూ మరిచిపోలేదు. ఆయనకు సాటి రాగల గాయకుడూ రాలేదు. తెలుగు సినీ సంగీతపు స్వర్ణయుగానికి ప్రతీకగా ఆయన ఎప్పటికి అమరుడే.ఘంటసాల వాయిస్ మైక్ కి పనికి రాదని హెచ్.ఏం. వీ సంస్థ చెప్పింది. ఘంటసాల కెరీర్ ప్రారంభంలో ఈ ఘటన జరిగింది.
అయినా ఘంటసాల నిరాశ పడలేదు.ఇంటికెళ్లి కూర్చోలేదు. నాటక సమాజం ఏర్పాటు చేసుకుని నాటకాలు ఆడుతూ ఉండేవారు. ఆ సమయంలోనే నటుడు అక్కినేని నాగేశ్వరరావు తో పరిచయం ఏర్పడింది. సీనియర్ సముద్రాల వారి సహకారంతో సినీ రంగంలో కి అడుగు పెట్టారు. అక్కినేని వారి మొదటి సినిమాలో చిన్న వేషం తో పాటు బృంద గానం లో గొంతు కలిపారు.
తర్వాత అవకాశాలు అవే వెతుక్కుంటూ వచ్చాయి. ప్రారంభంలో అవకాశమివ్వని హెచ్ ఏం వీ సంస్థ 1974 లో అదే ఘంటసాల తో భగవద్గీత శ్లోకాలను పాడించి రికార్డు చేసి .. విడుదల చేసింది. విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో విరామమనేది లేకుండా ఘంటసాల సాధన చేశారు. అలా ఆయన చేసిన సాధన కి ఫలితంగానే తెలుగువారి ఇళ్లలో .. దేవాలయాలలో ఇప్పటికీ ‘భగవద్గీత’ నిత్యం వినిపిస్తూనే ఉంది.