ప్రపంచానికి పాఠాలు నేర్పిన బ్రహ్మగుప్తుడు !

Sharing is Caring...

Thopudu Bandi Sadiq Ali……………….

ప్రపంచానికి చాలా విషయాల్లో పాఠాలు నేర్పింది మన భారతీయులే.ఒకటేమిటి అనేకానేక విషయాల్లో మనవాళ్ళు ప్రపంచానికి మార్గదర్శకులు అయ్యారు. ముఖ్యంగా గణితం,ఖగోళం,శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన పూర్వులు అసాధారణ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించారు.

మనదేశంపై పలుమార్లు దాడులు చేసిన మ్లేచ్చులు,ప్రాచ్యులు మన విజ్ఞానాన్ని కొల్లగోట్టుకుపోయారు. తర్వాత అదేదో వాళ్లే కనుగొన్నట్లు ప్రపంచాన్ని మభ్యపెట్టారు. పాశ్చాత్య మాయలో పడి భరతమాతను విమర్శిస్తున్న ఈ తరానికి తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళలో బ్రహ్మగుప్తుడు  ప్రముఖుడు.

ప్రముఖ భారతీయ గణిత,ఖగోళవేత్త బ్రహ్మగుప్తుడు.( క్రీస్తు శకం 598- 670 ) వీరు గుజరాత్ లోని ఖిల్లామారం లో జన్మించారు. మొదటి భాస్కరాచార్యునకు సమకాలీనులు. ఈయన ఆ కాలానికి సంబంధించిన గణిత,ఖగోళ విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకొని చాప రాజ్యాన్ని పరిపాలించిన వ్యాఘ్రముఖ మహారాజు ఆస్థానంలో ఖగోళ శాస్త్రజ్ఞునిగా స్థానం సంపాదించుకున్నారు.

గణిత శాస్త్రంలో ‘సున్నా’ ను గుర్తించి, దానిని ఉపయోగించే పధ్ధతి గురించి మొట్టమొదట తెలిపిన వారు బ్రహ్మగుప్తులు. ఏదేని ధనరాశికి లేదా ఋణరాశికి సున్నా కలిపితే, ఆ రాశిలో మార్పురాదు.  తీసివేసినా మార్పురాదనీ, ఏదైనా రాశిని సున్నాతో భాగిస్తే అనంతం వస్తుందని తెలిపారు.

అయితే సున్నాను సున్నాతో భాగిస్తే సున్నా వస్తుందని తెలిపారు. అది తప్పని తర్వాత కాలంలో నిరూపితమయ్యింది.అంక గణితం వేరు,బీజ గణితం వేరు అని చెప్పారు.ఈ రెండింటికి సంబంధించిన ‘బ్రహ్మస్ఫుట సిద్ధాంతం’ అనే గ్రంధాన్ని రచించారు. ఈ గ్రంధం అరబిక్ భాషలోకి అనువదించబడి శతాబ్దాల పాటు ప్రామాణిక గ్రంధంగా నిలిచింది.

ఈ గ్రంధం ద్వారానే   అరబ్బులు, భారతీయ ఖగోళ విజ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఎడ్వర్డ్ సక్సహూ “అరబ్బులకు ఖగోళశాస్త్రాన్ని నేర్పినది బ్రహ్మగుప్తుడే” అని స్పష్టంగా చెప్పాడు.   బాగ్దాద్ నగర నిర్మాత, అబ్బాసిడ్ ఖలీఫా  కోరిక మేరకు, మొహమ్మద్ అల్-ఫజారీ బ్రహ్మస్ఫుటసిద్ధాంతాన్ని అరబ్బీలోనికి అనువదించాడు.

ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ‘కారణ ఖండ బౌధ్యక ‘ అనే గ్రంధాన్ని రచించిన వీరు భారతీయ విజ్ఞానం గొప్పతనాన్ని లోకానికి చాటారు.  చక్రీయ బహుభుజిలకి సంబంధించి బ్రహ్మగుప్తుడు సాధించిన సూత్రం చాలా ప్రసిద్ధి పొందింది. భుజాల పొడవుల తెలిసినపుడు బహుభుజిల వైశాల్యాన్ని ఉజ్జాయింపుగానో, ఖచ్చితంగా లెక్కించే సూత్రాన్ని బ్రహ్మగుప్తుడు సూచించారు.

ఈయన  మేదాసంపత్తిని ప్రశంసిస్తూ మొదటి భాస్కరాచార్యుడు వీరికి గణకచక్ర చూడామణి అనే బిరుదునిచ్చి సత్కరించాడు.భారతదేశానికి అఖండ ఖ్యాతిని ఆర్జించిన వీరు క్రీస్తు శకం 670 సంవత్సరంలో ఈ లోకాన్ని వీడారు.(ఈ సంవత్సరం విషయంలో కొంత అస్పష్టత వుంది.) కాగా బ్రహ్మ గుప్తుడి వ్యక్తిగత వివరాలు స్పష్టంగా ఎక్కడా గ్రంధస్తం కాలేదు.
 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!