వసూళ్ళలో వెనకబడిన బిగ్ బ్రదర్ !

Sharing is Caring...

బిగ్ బ్రదర్  … రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలో మోహన్ లాల్ హీరో. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మోహన్ లాల్ ను  అభిమానించే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సిద్ధిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ ఆయనే  సమకూర్చుకున్నారు. కథ మీద కంటే మోహన్ లాల్ ఇమేజ్ బిల్డప్ పై సిద్ధిక్ శ్రద్ధ పెట్టారనే విమర్శలు లేకపోలేదు. సినిమా నిడివి ఎక్కువ. 

కొన్నిసన్నివేశాలు ఏ మాత్రం లాజిక్ కు అందవు. కథ క్లుప్తంగా ….సచ్చిదానందన్  సవతి తల్లిని ఇబ్బంది పెట్టే ఆమె మాజీ భర్తను చంపి  జువనైల్ హోమ్ కి వెళతాడు. అక్కడ కూడా తన స్నేహితులను వేధించిన పోలీసు అధికారిని చంపుతాడు. కోర్టు ఇందుకుగాను  సచ్చిదానందన్ కి డబుల్ జీవిత ఖైదును విదిస్తుంది.సచ్చిదానందం తమ్ముడు గట్టి ప్రయత్నాలు చేసి అన్నను బయటకు తీసుకొస్తాడు.

24 సంవత్సరాల తర్వాత చివరకు జైలు నుండి బయటకొచ్చిన సచ్చిదానందన్  తన కుటుంబంతో శాంతి యుతంగా జీవించాలనుకుంటాడు. కానీ అంతలో తమ్ముడు మను కిడ్నాప్ అవుతాడు. సచ్చిదానందన్ తన సోదరుడిని రక్షించడానికి స్వయంగా రంగంలోకి దిగుతాడు. తమ్ముడిని ఎలా రక్షిస్తాడు ? అనేది ప్రధాన కథ.

కథలో చాలా మలుపులుంటాయి. ప్రతి మలుపులో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. చీకట్లో ఫైటింగ్ సీన్స్ బాగుంటాయి. ఇందులో మోహన్ లాల్ పాత్రకు హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ ..ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం అభిమానులను అలరిస్తుంది. మోహన్‌లాల్ సచ్చిదానందన్‌గా తనదైన శైలిలో మంచి నటనను కనబరిచారు.యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టేసాడు.

వేదాంతం ఐపీఎస్‌ పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ కు నటించడానికి పెద్ద స్కోప్ లేదు. సినిమా నిడివి ని తగ్గించి ఉంటే బాగుండేది. మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. సినిమా కు అది ఒక మైనస్ పాయింట్. సినిమాలో వినోదం తక్కువ. ఉన్నకొన్ని సీన్లు కూడా పండలేదు.  మర్నామీనన్, హనీరోజ్ వంటి ప్రముఖ తారలను పెట్టారు కానీ వారివి  ప్రాముఖ్యత లేని పాత్రలు. నటీ నటులు అందరూ పాత్రల పరిధిలో బాగానే చేశారు.

జిత్తు దామోదర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది.దీపక్ దేవ్ సంగీతం…బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌  బాగానే ఉన్నాయి. కథ కొత్తదే కానీ కథనం అంత ఆసక్తికరంగా లేదు. దీంతో ఈ సినిమా హిట్ కొట్టలేదు. వసూళ్ళలో కూడా బిగ్ బ్రదర్ వెనుకబడ్డారు.  మోహన్ లాల్ ఉంటే చాలు అనుకుని తీసిన సినిమా అనిపిస్తుంది. కథ విషయంలో మరింత శ్రద్ధ చూపి ఉంటే బాగుండేది. ఆ మధ్య ఈ సినిమాను తెలుగు లో రీమేక్ చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే బోల్తా పడే ప్రమాదముంది. అమెజాన్ లో తెలుగు వెర్షన్ ఉంది. చూడని వాళ్ళు చూడొచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!