Shyam Mohan ………………………..
ఒక ఫ్రెండ్ ఫోన్‌లో మాట్లాడుతూ సినిమాలు ఏం చూశావ్ ? అని అడిగాడు. ఏమీ చూడలేదు.ఈమధ్య వస్తున్నవాటితో కనెక్ట్ కాలేక పోతున్నా.చూడాలనుకుంటే ‘ఇది కథకాదు’ ‘మరోచరిత్ర’‘సాగరసంగమం’ మళ్లీ మళ్లీ చూస్తాను.’ అన్నాను. ‘అయితే మనం పుట్టక ముందు వచ్చిన ఒక సినిమా లింక్ పంపుతున్నా చూడు’ అన్నాడు..రాత్రి చూశాను. ఒక పాటైతే ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.
పద్మ ఒక మానసిక వైద్యశాలలో నర్సు. ప్రేమలేమి లో ఉన్న వారు, ప్రేమించి దగాపడిన వారు, జీవితంలో గాయపడిన వారితో ప్రేమగా ఉంటూ, వారి మానసిక రుగ్మతలను,చెదరిపోయిన కలలను నయం చేయడం ఆమె డ్యూటీ. ఈ పద్ధతిలో వైద్యం చేస్తూనే, భాస్కర్ అనే పేషంటును నిజంగానే ప్రేమించడం మొదలుపెడుతుంది.
భాస్కర్ కూడా ఆమెని ఇష్టపడతాడు కానీ, చివరికి ఇది ఆమె వృత్తిలో భాగం అని తెలుసుకొని, కోలుకోగానే వెళ్ళిపోతాడు.తరువాత, మరో పేషంటు బాధ్యతలు స్వీకరిస్తుంది పద్మ. అయితే అతడు కూడా ఆమె ప్రేమలో పడతాడు. అప్పుడప్పుడే భాస్కర్ ప్రేమ నుంచి బయటపడుతున్న పద్మకి ఇంతలో ఈ అనుభవం ఎదురవడంతో మానసిక ఒత్తిడికి గురౌతుంది.
ఇలాంటి పరిణామాల మధ్య, మతి స్థిమితం తప్పి, అదే ఆసుపత్రిలో రోగి అవుతుంది. 1960లో తీసిన ఈ తెలుగు సినిమా పేరు ‘చివరకు మిగిలేది’. ఇదే పేరుతో బుచ్చిబాబు రాసిన నవలకు దీనికి సంబంధం లేదు. అషుతోష్ ముఖర్జీ బెంగాలీ కథ ‘‘నర్స్ మిత్ర’’ ఆధారంగా తెలుగులో తీశారు. ఆసుపత్రి నడిపే డాక్టర్ గా నటించిన ప్రభాకర రెడ్డికి ఇది తొలి చిత్రం.
నర్సు ప్రేమలో పడిన భాస్కర్ గా నటించిన కాంతారావు చాలా క్యూట్‌గా కనిపిస్తారు. పాత్రలో ఒదిగి పోయి అత్యద్భుతంగా నటించారు.మానసిక రోగులకు స్నేహితురాలిగా, ప్రేమికురాలిగా నటిస్తూనే, వ్యక్తిగత భావోద్వేగాలకు లోనవకుండా నటించిన పాత్ర పద్మలో ఎందరో అభిమానుల స్వప్నదేవత సావిత్రి నటించారు.
ఆమె ఈ సినిమాకు హీరో. సినిమా చివరి అంకంలో ఆమె నటన మనల్ని ఊపిరి పీల్చుకోనివ్వదు.చూసి తీరాలి తప్ప వర్ణించడం అసాధ్యం. సున్నితమైన ఎమోషన్స్‌ని చూపులతో పెదవులతో అభినయించిన తీరు చూస్తుంటే ఇలాంటి దేవత ఒకపుడు నడయాడిన నేల ఇదేనా ? అనిపిస్తుంది.
‘నాకు నటన చేతకాదు. చేయలేను… నిజంగానే ప్రేమించాను ’ అనే ఆమె డైలాగ్‌తో సినిమా ముగుస్తున్నపుడు భరించలేని విషాదం మనల్ని ముంచేస్తుంది.( ఆమె నిజజీవితం కూడా అలాగే ముగిసింది. )
ఘంటసాల ‘ సుధవో సుహాసినీ …మధువో విలాసిని ఓహో కమనీ సరసం…’ పాట వింటుంటే స్వర్గంలో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. మరో సారి రిప్లే చేయకుండా ఉండలేరు. కొంత కాలం ఆ గాన మాధుర్యం మెస్మరిజం నుండి బయట పడటం అసాధ్యం!
కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి తన మిత్రులతో కలిసి ఈ సినిమా నిర్మించారు.. ఇదే కథ ఆధారంగా హిందీ లో ‘ఖామోషీ’అనే చిత్రం 1969 లో వచ్చింది.వహీదా రెహమాన్ నాయిక, అలాగే “దీప్ జలే జాయి” అన్న బెంగాలీ చిత్రాన్ని కూడా ఇదే కథ ఆధారంగా నిర్మించారు.ఇందులో సుచిత్రా సేన్ కథానాయిక. మిగతా ఇద్దరు సావిత్రి నటన ముందు తేలిపోయారని అప్పటి విమర్శకులు తమ సమీక్షల్లో రాసారు. సుచిత్ర సేన్ కొంత బెటర్ అన్నట్టుగా రివ్యూలు వచ్చాయి.
తెలుగు సినిమాకు గుత్తా రామినీడు దర్శకత్వం వహించారు. రచయితలు అట్లూరి పిచ్చేశ్వర రావు, మల్లాది రామకృష్ణశాస్త్రీ స్క్రిప్ట్ అందించారు. మల్లాది రామకృష్ణశాస్త్రి, కొసరాజు. ఆరుద్ర రాసిన పాటలకు అశ్వత్థామ వినసొంపైన బాణీలు సమకూర్చారు.
‘చివరకు మిగిలేది’ సినిమా యూట్యూబ్‌లో ఉంది చూడండి. సుధవో సుహాసినీ …పాటను కింద లింక్‌లో చూసి కాసేపు వెన్నెల వానలో తడవండి.